కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణుల మధ్య వార్ నెలకొంది. ఐపీఎస్ అధికారిణి డీ రూప, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా వీరి వివాదం చివరకు కోర్టుకు చేరింది.
ఐపీఎస్ అధికారిణి డీ రూప తనపై అసత్య వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కోరుతూ ఐఏఎస్ అధికారిణి రోహణి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరు 74వ సిటీ సివిల్ న్యాయస్థానం.. ఐఏఎస్ రోహిణికి పరువు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని ఐపీఎస్ అధికారిణి డీ రూపను ఆదేశించింది.
రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధారరహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచురించకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రూపకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.