అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని చందంగా మారింది పాతబస్తీలో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థుల పరిస్థితి. పేరుకు టికెట్ దక్కించుకోవడమే తప్ప.. పార్టీ తరపున ప్రచారానికి నేతలు ఎవరూ రాకపోవడం వారిని తీవ్రంగా వేధిస్తోంది. ఎన్నికలేవైనానా సరే ప్రతీసారి ఇదే అనుభవం వారిని కుంగదీస్తోంది. ఎంఐఎంతో ఏ పొత్తు లేదంటారు.. కానీ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేయరు. ఫలితంగా కొన్నిచోట్ల గెలిచే అవకాశం ఉన్నా… అధిష్ఠానం తీరుతో ఆ అవకాశమే లేకుండాపోతోందని పలువురు వాపోతున్నారు.
2016 గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున జంబాగ్ డివిజన్ నుంచి బరిలోకి దిగిన ఆనంద్‌గౌడ్ ఇలాంటి అనుభవమే ఎదురైంది. నాటి ఎన్నికల్లో ఆయన కేవలం ఐదంటే ఐదే ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పుడు ఆయన తరపున ఎవరైనా ప్రముఖ నేతలు గట్టిగా ప్రచారం చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండేవాడనని ఇప్పటికీ తన సన్నిహితుల వద్ద వాపోతుంటారట. ఆనంద్‌గౌడ్‌లాంటి పరిస్థితే పాతబస్తీలో చాలా మంది అధికార పార్టీ లీడర్లది కూడా.
పాతబస్తీలో పోటీచేసేవారికి ఎంఐఎం పార్టీనే ప్రత్యర్థి. కానీ అధికార పార్టీ నేతలే తమది ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ అని చెప్తుండటంతో… వారిని ఏ విషయంలో విమర్శించాలో కూడా తెలియని అయోమయంలో పడ్డారు టీఆర్ఎస్ అభ్యర్థులు. కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓల్డ్ సిటీలో 10 డివిజన్లను గెలుస్తామని చెప్పడం అక్కడ పోటీ చేస్తున్నవారిని విస్తుపోయేలా చేస్తోంది.