ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనా టీకా ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే పలుచోట్ల గ్రామాల్లోని ప్రజలు టీకా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇదే తరహాలో టీకా వేయించుకోవాలని చెప్పిన ఓ పోలీస్ అధికారి చేయి విరిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని మహువర్ గ్రామంలోని ప్రజలకు టీకాలు వేయడానికి వైద్యాధికారులు వచ్చారు. గ్రామానికి చెందిన రామచంద్ర ఠాకూర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు టీకా తీసుకోవడానికి నిరాకరించారు. వైద్య సిబ్బందితో పాటు అక్కడే ఉన్న పోలీస్ అధికారి కృష్ణ కుమార్ మరాండి వ్యాక్సిన్ ప్రయోజనాల గురించి చెప్పి వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. దీంతో కోపోద్రికుడైన ఠాగూర్ పోలీసు అధికారిపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో పోలీస్ అధికారి చేయి విరిగింది. వెంటనే అక్కడి నుండి పారిపోయాడు ఠాగూర్. గాయపడిన పోలీస్ అధికారి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.