కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మల్లిఖార్జున్ ఖర్గే, శశిథరూర్ ఇద్దరూ మంచి దూరదృష్టి, ఉన్నత దృక్పథాలు కలిగిన సీనియర్ నేతలేనని , అలాంటిది ఒకరు అధ్యక్షునిగా ఎన్నికైతే వారిని ‘రిమోట్ కంట్రోల్’ అని వ్యవహరించడం వారిని అవమానించినట్టే అవుతుందని రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం ‘రిమోట్ కంట్రోల్’ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేదా రాహుల్ లేక ప్రియాంక గాంధీ చేతుల్లో మాత్రం ఉన్నట్టే ఉంది. ఇందుకు నిదర్శనంగా కర్ణాటకలో సాగుతున్న రాహుల్ భారత్ జోడో పాద యాత్రకు ఖర్గేని దూరంగా ఉంచడమే. అంటే ఈ యాత్రలో ఆయన పాల్గొనకుండా చూడాలని రాహుల్ భావించారట.
ఖర్గే రాష్ట్రంలో ఈ యాత్ర సందర్భంగా కనీసం ఓ మీటర్ దూరమైనా నడవలేదు. పైగా అధినేత్రి సోనియా మాండ్యా జిల్లాలోని పాండవపురను విజిట్ చేసినప్పుడు కూడా ఆయన ఆమెను కలుసుకోలేదు. ఈ నెల 15 న బళ్లారిలో కాంగ్రెస్ నిర్వహించే ర్యాలీకి కూడా ఆయన హాజరు కాకపోవచ్చునని అంటున్నారు. రాహుల్ సూచనతోనే ఆయన జోడో యాత్రకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాత్రలో పాల్గొంటే అది పార్టీ సంస్థాగత ఎన్నికల ముందు వాతావరణాన్ని ‘ప్రభావితం’ చేయగలదట.. గాంధీ కుటుంబం ఈయనకు మద్దతునిస్తోందని అందరూ భావించినట్టవుతుందని రాహుల్ అభిప్రాయపడుతున్నారని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలో తాము తటస్థంగా ఉంటామని సోనియా ఇదివరకే ప్రకటించారు.
రాష్ట్రం నుంచి మల్లిఖార్జున్ ఖర్గే అత్యంత సీనియర్ నేత అని, రాహుల్ ఆదేశాలపై ఆయన కావాలనే ఈ యాత్రకు దూరంగా ఉంటున్నారని సీనియర్ నాయకుడొకరు చెప్పారు. కానీ ఇందులో పాల్గొనే హక్కు ఆయనకు పూర్తిగా ఉందన్నారు. సోనియా మాండ్యా జిల్లాకు వచ్చినప్పుడు ఖర్గే ఆమెకు ఓ మెసేజ్ పంపారని, పరిస్థితి ఆయనకు అర్థమైందని ఆ నాయకుడు చెప్పారు.
మరి కేరళలో రాహుల్ యాత్ర చేస్తున్నప్పుడు శశిథరూర్ ఆయనను రెండు సార్లు కలుసుకోలేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో ఒకసారి, పలక్కాడ్ లో రెండో సారి రాహుల్ తో భేటీ అయ్యారు కదా అని కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ అప్పటికి థరూర్ తన నామినేషన్ దాఖలు చేయలేదని, కానీ నామినేషన్ వేస్తానని ఆయనకు ముందే తెలుసునని అనేవారూ ఉన్నారు.