కర్ణాటకలోని పాఠశాలలలో మరో వివాదం తెరపైకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు జరిగిన హిజాబ్ వివాదం మరవక ముందే.. ఇప్పుడు పాఠశాలలో బైబిల్ చదవాలంటూ ఓ పాఠశాల కొత్త విదానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడది మరో వివాదాన్ని రాజేస్తోంది.
బెంగళూరులోని క్లియరెన్స్ హైస్కూల్ లో బైబిల్ చదవాలంటూ విద్యార్ధులకు స్కూల్ యాజమాన్యం కొత్త నిబంధన పెట్టింది. అయితే.. తమ పిల్లలు స్కూల్ కు బైబిల్ తీసుకెళ్లడాన్ని అభ్యంతర పెట్టబోమని తెలియజేస్తూ.. పేరెంట్స్ నుండి కూడా అంగీకారాన్ని తీసుకుంటోంది యాజమాన్యం.
దీనిపై హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రిస్టియన్ కాని విద్యార్థులను సదరు పాఠశాల బలవంతంగా బైబిల్ చదివిస్తోందని ఆరోపించారు. కానీ.. క్లియరెన్స్ స్కూల్ తన తీరును సమర్థించుకుంటోంది.
బైబిల్ ఆధారిత విద్యా బోధనను అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. గ్రేడ్ 11 అడ్మిషన్ పత్రంలో తల్లిదండ్రుల డిక్లరేషన్ కాలమ్ ను క్లియరెన్స్ స్కూల్ అమలు చేస్తోంది. అందులోనే పిల్లలు స్కూల్ కు బైబిల్ తీసుకెళ్లడానికి అభ్యంతరం లేదంటూ ధ్రువీకరణ తీసుకుంటోంది.