తల్లికడుపులోనుండే కొట్టుకుంటూ పుట్టుకొస్తున్న అన్నదమ్ముల రోజులివి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టి ఒకరి రక్తం మరొకరు కళ్ళచూసుకునే కఠినమైన కాలమిది. కానీ మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని షెగాల్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఒకరిపట్ల మరొకరు ప్రేమానుబంధాలను చాటుకున్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ వాళ్ళ అనుబంధం ఏంటి వాళ్ళు చాటే ఆదర్శం ఏంటి అంటారా..!?
కొత్తగా పెళ్ళయిన దంపతులెవరైనా సంతానం కోసం ఎంతగానో తపిస్తారు. ఎన్నో కలలు కంటారు. తమ ఇంట ఆడ పిల్ల పుట్టాలని కొందరు, అబ్బాయి పుట్టి వంశాన్ని నిలపాలని కొందరు ఆరాటపడుతుంటారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలోని షెగాల్ గ్రామానికి చెందిన బిరుదేవ్ మానే, అప్పాసో మానే అన్నదమ్ములు. బిరుదేవ్ మానేకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారు.
ఐదేళ్ల క్రితం కుమారుడు జన్మించగా, రెండేళ్ల క్రితం మళ్లీ కుమారుడే పుట్టాడు. అప్పాసోకు మొదటి బిడ్డగా పాప పుట్టింది. రెండు నెలల క్రితం మళ్లీ ఆడ శిశువు జన్మించింది. ఈ క్రమంలో రెండేళ్ల కుమారుడిని, రెండు నెలల ఆడ శిశువును అన్నదమ్ములు మార్చుకున్నారు.
తమ్ముడి రెండు నెలల కుమార్తెను అన్న దత్తత తీసుకున్నాడు. చిన్నారికి పేరు పెట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఔరా అనిపించాడు. బిరుదేవ్ చిన్న కుమారుడు ఆరుశ్ను అప్పాసో దత్తత తీసుకున్నాడు.
దీంతో ఆడపిల్ల కావాలనుకున్న బిరుదేవ్ కోరిక, ఇటు మగపిల్లవాడు కావాలనుకున్న అప్పాసో కోరికా తీరింది. పిల్లలను ఇలా దత్తత తీసుకోవడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేశారు.