తెలంగాణలో మంత్రులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు కాన్వాయిను బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లు ఇవ్వకుండా నిరుద్యోగుల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. అబద్దాల హామీలతో ఇంకెంత కాలం పూట గడుపుతారని నిలదీశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం.. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలన్నారు. పెద్దకొత్తపల్లి, చిన్నంబావి, పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్శణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఆందోళనలకు పాల్పడిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.