ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష ఎస్పీ.. ఇంకో వైపు కాంగ్రెస్, మరోవైపు బీఎస్పీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయ్యారు. రాజకీయాల్లో మార్పులు చేర్పులు.. చేరికలు చీలికలు జరుగుతున్నాయి.
అయితే.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. అరే అదేంటి..?బీజేపీకి వరుసగా షాక్ లు ఇస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ.. ఎస్పీ గూటికి క్యూ కడుతోన్న సమయంలో.. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ఏంటి..? అనే అనుమానం వెంటనే రావొచ్చు.. విషయం ఏంటంటే.. అది కేవలం ఉన్నావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్ ను పోటీకి పెట్టింది. దీనిపై తాజాగా స్పందించిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ఉన్నావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్పార్టీకి మద్దతుగా మద్దతుగా ఉంటామని ప్రకటించారు.
ఆ స్థానం నుంచి ఎస్పీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న అభ్యర్థికి వారి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అత్యాచార కేసు బాధితురాలి తల్లికి తాము అడ్డురామని స్పష్టం చేశారు అఖిలేష్ యాదవ్.