ఉక్రెయిన్ లో నెలకొన్న హింసకు ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ప్రధాని మోడీ కోరారు. సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోడీ సూచించారు.
ఉక్రెయిన్ లో పరిస్థితులపై పుతిన్ ను ప్రధాని మోడీ ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. ‘ ఉక్రెయిన్ లో నెలకొన్న హింసను తక్షణమే ఆపివేయాలని ప్రధాని మోడీ కోరారు. దౌత్యపరమైన చర్చలు, సంభాషణల ద్వారా సమస్య పరిష్కరించుకునే మార్గానికి అన్ని పక్షాలూ రావాలని పిలుపునిచ్చారు” అని ప్రధాని ఫోన్ సంభాషణ గురించి పీఎంవో ప్రకటన చేసింది.
ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి భారత్ ఆందోళనల గురించి రష్యా అధ్యక్షుడికి మోడీ తెలియజేశారని పీఎంవో తెలిపింది. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మోడి చెప్పారని వెల్లడించింది.
ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలను మోడీకి పుతిన్ వివరించారని పీఎంవో చెప్పింది. “రష్యా, నాటో గ్రూపుల మధ్య విభేదాలు నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని మోడీ సూచినట్టు ప్రకటనలో పేర్కొంది.