పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి బీజేపీ మంచి ఊపు మీద ఉంది. నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్ లో జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఓ విషయం బీజేపీ నేతలను కలవర పరుస్తోంది. రాష్ట్రంలో ఆపిల్ పండించే రైతులు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉండటం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 18 నుంచి 20 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆపిల్ రైతులు ప్రభావం చూపగలరు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బీజేపీ నేతలు తలమునకలయ్యారు.
ఆపిల్ రైతుల సమస్యలు..
ఇటీవల ఇన్ పుట్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఆపిల్ రైతుల ఆదాయాలకు గండి పడింది. ప్రభుత్వం పన్నులను అధికంగా పెంచడంతో తమ ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్టు రైతులు చెబుతున్నారు. దీనికి తోడు వ్యాపారుల, దళారుల దోపిడితో తాము ఆదాయాన్ని కోల్పోతున్నామని వాపోతున్నారు.
అంతే కాకుండా ఇటీవల కరువు, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆపిల్ పంట దెబ్బతిన్నది. ఆపిల్ పరిమాణం తగ్గడంతో బహిరంగ మార్కెట్‌లో ఆపిల్ కు చాలా తక్కువ ధర పలుకుతోంది. ఈ క్రమంలో తమను ఆదుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఆపిల్ రైతుల నిరసనలు…
ఆపిల్ పండించే రైతులకు సంబంధించిన 27 సంఘాలు కలిసి సంయుక్త కిసాన్ మంచ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గతవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాలు మండిపడ్దాయి. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ నేతలతో సీఎం జయరాం ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ సమస్యల పరిష్కారానికి సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్న రైతులు
రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించిందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించకుండా కమిటీల పేరిట మరింత కాలాయాపన చేస్తుండటంపై రైతు సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కమిటీ సూచనలు చేసే సమయానికి ప్రస్తుత సీజన్ పూర్తవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
రైతులు ప్రధాన డిమాండ్లు…
సంయుక్త కిసాన్ మంచ్ ఆధ్వర్యంలో రైతులు ముఖ్యమంత్రికి 20 డిమాండ్లతో కూడిన మెమోరాండంను సమర్పించారు. అందులో ప్యాకేజింగ్ మెటీరియల్స్ పై జీఎస్టీని ఎత్తి వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌ను నియంత్రించేందుకు అన్ని ఏ,బీ,సీ రకాల ఆపిల్స్ కు మద్దతు ధరను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇరాన్, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆపిల్స్ పై దిగుమతి సుంకాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పెరుగుతున్న ఇన్ పుట్ రేట్లను తగ్గించాలని, రైతులకు సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల్లో ఆపిల్ రైతుల ప్రభావం….
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆపిల్ రైతుల ప్రభావం చూపనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కిన్నౌర్, సిమ్లా, సిర్మౌర్, సోలాన్, కులూ, చంబాలోని పలు ప్రాంతాల్లో ఆపిల్ రైతుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ రైతులను సంతృప్తి పరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.