ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరేయగా.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండాను ఎగరేసింది. అఖండ విజయం తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా శనివారం పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం చండీఘడ్ నగరంలోని రాజ్‌భవన్‌లో అట్టహాసంగా జరిగింది.
దేశంలోనే నిజాయితీ గల ప్రభుత్వంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు పొందుంతుందంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్వీట్ చేశారు. అలాగే తన మంత్రి వర్గ కూర్పులో అన్ని వృత్తుల శాసన సభ్యులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఇద్దరు వ్యవసాయదారులు, ముగ్గురు లాయర్లు, ఇద్దరు డాక్టర్లు, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఇంజనీర్, ఒక వ్యాపారవేత్త కొత్త మంత్రివర్గంలో ఉన్నారని తెలిపారు.
పది మందిలో ఐదుగురు మాల్వా ప్రాంతానికి చెందినవారు కాగా.. నలుగురు మజాకు, ఒకరు దోబా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. పది కేబినెట్ బెర్త్ లను భర్తీ చేసిన తర్వాత మిగిలిన ఏడు ఖాళీలను రెండోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.
కాగా.. తనతో సహా 18 మందికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం దక్కుతోందని భగవంత్ మాన్ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. మార్చ్ 16న భగత్ తన సొంత గ్రామమైన ఖతర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తర్వాత రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.