మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణలోని విద్యావ్యవస్థ దుస్థితిని బయటపెడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికి పైగా స్కూళ్లు మూతపడడానికి కారణం కేవలం టాయిలెట్స్ లేకపోవడమే అని ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుకోవడానికి సుముఖత చూపకపోవడానికి శుభ్రమైన టాయిలెట్స్ లేకపోవడమే కారణమని అన్నారు. అయితే పరిశుభ్రమైన టాయిలెట్స్ అందించడమనేది హ్యూమన్ రైట్స్ లో భాగమని, అలా.. శుభ్రత కల్గిన టాయిలెట్స్ ను పిల్లలకు అందించడం ద్వారానే వారికి హెల్దీ ఎన్విరాన్ మెంట్ గురించి బోధించడం సాధ్య పడుతుందని ఆయన పేర్కొన్నారు.అయితే తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనుకుంటున్న ప్రభుత్వం ముందుగా టాయిలెట్స్ ను ఏర్పాటు చేయాలన్నారు.
అందుకు ప్రభుత్వం నిధులను కేటాయించాల్సిన అవసరం చాలా ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదవడానికి ముందుకు వస్తారన్నారు. దాని ద్వారానే ప్రభుత్వం అక్షరాస్యత శాతాన్ని పెంచగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్స్ ను ఏర్పాటు చేసే విషయంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.