రాజ్యాంగం ప్రకారం.. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. ఏపీ అసెంబ్లీలో పాలన వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు ఆయన. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎం జగన్ కు లేఖ రాశానని అన్నారు.
దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ పలచన చేస్తుంటే.. ఇది పరువు తీసుకోవడమే కాకుండా అవుతోందని మంత్రి మాజీ మంత్రి ధర్మాన వెల్లడించారు. శాసనాలు చేసే అధికారం అసెంబ్లీ, పార్లమెంట్‌కు తప్ప వేరే వాళ్లకు లేదని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగ వ్యతిరేకమైన సందర్భంలో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం మారితే విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని న్యాయవ్యవస్థ ఎలా చెప్తుందని ప్రశ్నించారు. ప్రజలు తీర్పు ఇచ్చారంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చలేదనే అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఆ అధికారం లేదని కోర్టులు చెప్తే ఏం చేయాలని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది కేవలం శాసన వ్యవస్థ మాత్రమే అని ధర్మాన స్పష్టం చేశారు.