హైదరాబాద్ చైతన్యపురిలో కోట్లు విలువ చేసే ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ఎకరన్నరను అన్యాక్రాంతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు. ఫ్రూట్ మార్కెట్ స్థలాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ కు టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు.
కాగా ఈ స్థలంపై ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో ఓ మైనార్టీ వర్గానికి ఎకరన్నర స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు ఆయన. వెంటనే అధికారులు స్థలం చుట్టూ రేకులు కట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ పార్టిషన్ ను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలన్నారు.
ముస్లింలకు అప్పనంగా స్థలం అప్పగించేందుకు ఎమ్మెల్యే మరియు అధికారులు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. స్థానిక కార్పొరేటర్ గా.. తనకు తెలియకుండా ఆ మార్కెట్ స్థలాన్ని ఎవరికి ధారాదత్తం చేస్తున్నారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త నిలదీశారు.
కార్పొరేటర్ గా ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని..ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించుకొని ఈ కబ్జా కుట్రను ఆపకపోతే.. బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నామని, ఇందులో అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.