ఏపీలో నమోదైన కేసుల ఆధారంగా ఇక్కడ ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీరావు, ఎండీ శైలజ పైన ఈనెల 20వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమంటూ ఏపీ ప్రభుత్వం సోమవారం తెలంగాణ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రభుత్వ హామీని రికార్డు చేసిన హైకోర్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
అయితే ఏపీలో ఈ నెల 10న నమోదైన కేసుల దర్యాప్తు పేరుతో కఠిన చర్యలు తీసుకోకుండా, హైదరాబాద్ లోని మార్గదర్శి కార్యాలయంలో సోదాలు, అరెస్టులు వంటివి చేయకుండా ఆదేశాలివ్వాలంటూ.. లంచ్ మోషన్ విచారణ చేపట్టాలని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని అనుమతించిన జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.
అయితే విచారణ చేపట్టే ముందు కోర్టు పరిధిని పరిశీలించాల్సి ఉందని, అందువల్ల వారం రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తారా లేదంటే ఉత్తర్వులు జారీ చేయమంటారా అని ఏపీ న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ వివరణ తీసుకొని ఏపీ ప్రభుత్వ న్యాయవాది..ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు.
దాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. అంతకు ముందు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో మార్గదర్శిలో సోదాలు నిర్వహించకుండా ఈ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.