మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో భారత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మొదటిసారి పార్లమెంట్ లోని ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ వద్ద మీడియాతో మోడీ మాట్లాడారు. ఇది భారత రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం. ఆదివాసీలకు, మహిళకు ఇచ్చే గౌరవం అని పేర్కొన్నారు.
ఈ సమావేశాల సమయంలో పార్లమెంటులో ఎవరైనా నూతన సభ్యుడు మాట్లాడాలనుకుంటే వారిని కూడా ప్రోత్సహిస్తామన్నారు. దేశ ఆర్థిక మంత్రి కూడా ఒక మహిళే అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. కేవలం మన దేశం మాత్రమే కాదు.. యావత్ ప్రపంచ దేశాలు కూడా మన బడ్జెట్‌పై దృష్టి పెట్టినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచ ఆర్ధిక అంశాలపై విశ్వసనీయమైన సంస్థలు కొన్ని పాజిటివ్ సందేశాలు చేశాయన్నారు.
ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్ అన్న ఆలోచనా విధానాన్ని బడ్జెట్ సమావేశాల ద్వారా ముందుకు తీసుకువెళ్లనున్నట్లు మోడీ చెప్పారు. పార్లమెంట్ ముందు విపక్ష నేతలు కూడా తమ అభిప్రాయాలు వెల్లడిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉందని, సాధారణ ప్రజల ఆశయాలు, ఆశలకు తగినట్లు బడ్జెట్ ఉంటుందని, ఆ ఆశయాలకు తీసిపోని విధంగా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.