ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో రష్యాకు మొట్టమొదటిసారిగా ఇండియా పెద్ద షాకిచ్చింది. ఉక్రెయిన్ లో తాను విలీనం చేసుకున్న నాలుగు ప్రాంతాలకు సంబంధించి దీన్ని ఖండిస్తూ రూపొందించిన ముసాయిదా తీర్మానం మీద రహస్య బ్యాలట్ నిర్వహించాలన్న ఆ దేశ డిమాండును ఇండియా వ్యతిరేకించింది. ఇండియాతో బాటు 107 దేశాలు…. సీక్రెట్ బ్యాలట్ నిర్వహించాలన్న రష్యా కోర్కెను తోసిపుచ్చుతూ ఓటు వేశాయి. 13 దేశాలు మాత్రం రష్యా డిమాండును సమర్థించగా 39 దేశాలు గైర్ హాజరయ్యాయి. రష్యా తో సహా చైనాకూడా ఓటు చేయలేదు.
ఉక్రెయిన్ లోని డోనెస్క్స్, ఖేర్సన్, లుహాన్స్క్, జపోర్ఝజియా ప్రాంతాలను రష్యా రెఫరెండం పేరిట అక్రమంగా విలీనం చేసుకుందని.. దీన్ని ఖండిస్తున్నామని అల్బేనియా మొదట ఓ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిపై రహస్య బ్యాలట్ నిర్వహించాలని రష్యా డిమాండ్ చేసింది. తమ డిమాండుకు చుక్కెదురు కావడంతో.. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. రికార్డెడ్ ఓటింగ్ విధానం చేపట్టాలని సూచించింది. కానీ ఇండియా సహా 104 దేశాలు ఓటింగ్ లో వ్యతిరేకించాయి గనుక ఈ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించరాదని ఐరాస సర్వ ప్రతినిధి సభ నిర్ణయించింది.
దీనిపై రష్యా శాశ్వత ప్రతినిధి వ్యాసిలీ నెబెంజియా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ .. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి తమకు అవకాశం ఇవ్వలేదని.. తమ స్టేట్ మెంట్ ని వక్రీకరించారని ఆరోపించారు. తమ అభిప్రాయాలను స్వేచ్చగా వ్యక్తం చేసే హక్కును సభ్య దేశాలనుంచి హరిస్తున్నారని అన్నారు.
ఉక్రెయిన్ లో రెఫరెండం నిర్వహించాలన్న ప్రతిపాదనను ఖండించడానికి ఉద్దేశించిన ముసాయిదా తీర్మానంపై భద్రతామండలిలో గత నెల జరిగిన ఓటింగ్ లో పాల్గొనకుండా ఇండియా దూరంగా ఉంది. 15 మంది సభ్యులున్న మండలిలో 10 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశాయి. ఇండియా, చైనా, గేబన్, బ్రెజిల్ ఇందులో పాల్గొనలేదు. రష్యా వీటో చేసిన ఫలితంగా ఈ తీర్మానం ఆమోదం పొందలేదు. నిన్న ఉక్రెయిన్ పై రష్యా రాకెట్, క్షిపణి దాడులతో విరుచుకు పడడాన్ని ఇండియా ప్రత్యక్షంగా ఖండించలేదు. అయితే ఉభయ దేశాలూ దౌత్యపరంగా శాంతి చర్చలకు కూర్చోవాలని సూచించింది. గత 6 నెలల్లో ఉక్రెయిన్ కి భారత్ .. వంద టన్నుల
ఆహార సామాగ్రిని పంపింది.