ఓ మనిషికి, మూగజీవానికి మధ్య గాఢంగా పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా తెగిపోయింది. వారి స్నేహం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. సాధారణంగా పక్షులు, జంతువులతో బంధాన్ని పెంచుకుంటున్న వ్యక్తులను చూస్తున్నాం.. కానీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడికి, కొంగకు మధ్య కొన్ని నెలలుగా సాగిన స్నేహం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గాయపడిన తనను కాపాడిన ఆ యువకుడిని విడిచి పెట్టి ఉండలేక సారస్ జాతికి చెందిన ఆ కొంగ అతనితోనే ఉండిపోయింది. మొదట్లో దాన్ని దూరం చేసుకోవడానికి ఆ వ్యక్తి ఎంతగా ప్రయత్నించినా అది మాత్రం అతడ్ని వదలలేదు. దాంతో ఆ యువకుడు కూడా ఆ కొంగపై అభిమానాన్ని పెంచుకున్నాడు. తాను ఏ ఆహారం తిన్నా ఆ కొంగకు కూడా పెట్టేవాడు.
యూపీలో అమేథీ జిల్లా మండ్కా గ్రామానికి చెందిన యువరైతు మహ్మద్ ఆరిఫ్ ఖాన్ గుర్జార్ కి, ఈ కొంగకు మధ్య ఇలా ఉన్న ఈ బంధం ముగిసింది. ఇతని నుంచి ఈ కొంగను అటవీశాఖ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై కేసు పెట్టారు. కొంగను రాయ్ బరేలీ లోని సమస్ పూర్ పక్షి సంరక్షణ కేంద్రానికి తరలించారు. తన కుటుంబంలో ఒకటిగా కలిసిపోయిన ఈ పక్షిని వాహనంలో తరలిస్తుండగా ఆరిఫ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఏడాదిగా తాను ఎంతో ప్రేమగా చూసుకున్న కొంగ దూరమవుతోందని బాధపడ్డాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇతని అంగీకారంతోనే తాము కొంగను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
సంవత్సరం క్రితం ఆరిఫ్ పొలంలో కాలు విరిగిపోయి రక్తమోడుతున్న ఈ సారస్ కొంగను చూసిన ఇతగాడు వెంటనే ఇంటికి తీసుకుపోయి దానికాలుకు చికిత్స చేశాడు. అప్పటి నుంచి అది అతనితోనే ఉండిపోయింది. 5 అడుగుల ఎత్తు, రెక్కలు విప్పినప్పుడు 8 అడుగుల వెడల్పు ఉండే ఈ కొంగకు ఆరిఫ్ ‘బచ్చా’ అని పేరు పెట్టాడు.
తాను బైక్ పై వెళ్తుంటే అది కూడా అతని వెంటే ఎగురుకుంటూ వచ్చేది. ఇతని నుంచి ఈ పక్షిని వేరు చేసిన తీరుపై మండిపడిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. ప్రధాని మోడీ ఇంట్లో ఉన్న నెమళ్లను ఏ అధికారి అయినా తరలించగలుగుతాడా..అతనికి అంత దమ్ము ఉందా అని ప్రశ్నించారు. అయితే మోడీ పేరును ఆయన ప్రస్తావించలేదు.