ఉత్తర ప్రదేశ్ లో 1500 ఏళ్ళ కాలం నాటి గుడి బయట పడడం ఆసక్తికరంగా మారింది. ఉత్తర ప్రదేశ్, ఈటా జిల్లా, అలిగంజ్ సమీపంలోని ప్రదేశంలో త్రవ్వకాలలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI) గుప్తుల కాలానికి చెందిన రెండు స్తంభాలను కనుగొంది. ఈ పురాతన స్తంభాల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ASI మెట్ల మీద శంఖు లిపిలో (షెల్ స్క్రిప్ట్) శాసనం వ్రాయబడిందని తెలిపింది. ఇవన్నీ 1500 ఏళ్ల కంటే పాతవి. గుప్తుల కాలం నాటి 5వ శతాబ్దపు దేవాలయానికి చెందినవని తెలుస్తోంది.
సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణకర్ ఈటా జిల్లాలోని అలీగంజ్ ప్రాంతానికి సమీపంలోని బిల్సాద్ గ్రామంలో ఈ ప్రదేశం ఉందని చెప్పారు. ఇది గుప్త రాజవంశం పాలనలో నిర్మించిన దేవాలయంగా భావిస్తున్నారు. ఇక్కడ కనుగొన్న రెండు స్తంభాలపై గుప్త రాజవంశంలోని పవర్ ఫుల్ పాలకుడు కుమారగుప్తుడు గురించి ఉందని, ప్రస్తుతం అక్కడ మరింతగా పని జరుగుతోందని ఆయన చెప్పారు.
ఆలయ ప్రవేశంలో కనుగొన్న రెండు స్తంభాల లోతును తెలుసుకోవడానికి మరింత త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ ప్రదేశంలో మెట్లు బయటపడ్డాయి. అది దేవాలయ ప్రవేశ భాగమై ఉండొచ్చని వారు అనుకుంటున్నారు. అక్కడ ఐదవ శతాబ్దపు విలక్షణమైన ‘శంఖ లిపి’లో శాసనాలు ఉన్నాయి. అందులో ఒక శాసనంపై శ్రీ మహేంద్రాదిత్య అనే పేరు ఉండడం గమనార్హం. గుప్త చక్రవర్తి కుమార గుప్తుడు క్రీస్తుశకం 415 నుండి క్రీ.శ. 455 వరకు పరిపాలించాడని చరిత్రలో ఉంది. ఆయనకు అప్పట్లో శ్రీ మహేంద్రాదిత్య అనే బిరుదు ఇచ్చారట. ఆయన తన పాలనలో ‘అశ్వమేధ యాగం’ కూడా చేశాడు. లక్నో స్టేట్ మ్యూజియంలో ఇలాంటి శాసనం ఉన్న గుర్రపు శిల్పం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.