భారత కంపెనీల దగ్గుమందు పై ఇతర దేశాల ఆరోపణల నేపథ్యంలో కేంద్రం విచారణకు సిద్ధమైంది. గాంబియా దేశంలో భారత దగ్గుమందు విషయం మరవక ముందే ఉజ్బెకిస్తాన్ కూడా అలాంటి ఆరోపణలే చేయడమే ఇందుకు కారణం.
భారత్ కంపెనీకి చెందిన దగ్గుమందు వాడటం వల్ల తమ దేశంలో 18 మంది పిల్లలు మరణించారని అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గుమందు డాక్ 1 మాక్స్ సేవించి తమ దేశంలో పిల్లలు మరణించినట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ సిరప్ లో విషపూరితమైన ఇథిలిన్ గైకాల్ ఉన్నట్లు ప్రయోగశాలలో తేలినట్లు అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక ఫార్మాసిస్ట్ సరైన ప్రిస్ర్కిప్షన్ లేకుండానే పిల్లలకు మందు ఇచ్చారని.. మోతాదుకు మించి మందు వాడటం కూడా మరణాలకు కారణం అయి ఉంటుందని పేర్కొంది ఆ ప్రభుత్వం.
ఈ సిరప్ ను 2 నుంచి 7 రోజుల పాటు 2.5 నుంచి 5 ఎంఎల్ మోతాదులో రోజుకు మూడు నుంచి 4 సార్లు తీసుకున్నట్లు వెల్లడించింది. జలుబు నివారణకు తల్లిదండ్రులు ఈ సిరప్ మందును వాడారు. పిల్లల మరణg తర్వాత దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ 1 మాక్స్ టాబ్లెట్లను,సిరప్ లను తొలగించింది ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం. దీనికి కారణంగా భావిస్తున్న ఏడుగురు ఉద్యోగులను కూడా తొలిగించినట్లు తెలిపింది.
ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా సదరు మందుల కంపెనీలపై విచారణ ప్రారంభించాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి మరిన్ని వివరాలను కోరుతామని తెలిపారు. గతంలో కూడా ఆఫ్రికా దేశం గాంబియాలో కూడా 70 మంది పిల్లలు మరణించారు. దీనికి కూడా భారత్ లోని హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్ కారణం అని ఆ దేశం ఆరోపించింది. దీంతో ఆ సంస్థను మూసేయడం జరిగింది.