నేవీడే సందర్భంగా ఏపిలోని విశాఖ ఆర్కే బీచ్ నౌకాదళ విన్యాసాలతో అదిరిపోయింది. యుద్ద నౌకలతో నౌకాదళం నిర్వహించిన విన్యాసాలు అందర్ని అబ్బురపరిచాయి. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమాన విన్యాసాలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హైస్పీడ్ బోట్లతో సముద్రం నుంచి వేగంగా ఒడ్డుకు రావడం, యుద్ద నౌకలో విన్యాసాలు, గగనతలంలో చేతక్ హెలికాప్టర్ల సాహసకృత్యాలు, మిగ్ -29 యుద్ద విమానాల ప్రదర్శన సహా యుద్ద నౌకలు, జలాంతర్గాముల నుంచి ఒకే సారి రాకెట్ ఫైరింగ్ చేయడం అందర్ని ఎంతగానో మెప్పించింది.
నౌకాదళ లాంఛనాలతో సూర్యాస్తమయ వేడుకలు నిర్వహించారు. యుద్దనౌకల నుంచి రంగు రంగుల కాంతులతో బాంబులు విసరడం ఆకట్టుకుంది. వివిధ రకాల ప్రమాణాలతో నౌకాదళ సిబ్బంది జాతీయ పతాకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శంకర్ ఎహసాన్ లాయ్ బృందం ఆలపించిన నౌకాదళ గీతం వీనుల విందుగా సాగింది.
ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కాగా.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసన సభాపతి తమ్మినేనితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.