నమ్మి చిట్టీలు కడితే నట్టేట ముంచాడు ఓ వ్యక్తి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ.30 కోట్లకు టోకరా వేసి.. తీరా నష్టపోయానంటూ ఐపీ పెట్టాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘరానా మోసం వరంగల్ జిల్లా కేంద్రంలోని లేబర్ కాలనీ టీఆర్‌టీ కాలనీలో చోటుచేసుకుంది.
గత దశాబ్దకాలంగా కాలనీలో మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఏళ్లుగా పరిచయం ఉండటంతో స్థానికులు నమ్మి చిట్టీలు కట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కల్పవల్లి అసోసియేట్స్ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు. చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండడంతో పలువురు వడ్డీ ఆశతో రూ.లక్షలు ఆయనకు ఇచ్చారు.
అయితే, కొద్ది కాలంగా చిట్టీలు ఎత్తుకున్న వారికి, డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడం ఆలస్యం చేశాడు. దీంతో బాధితులు ఆయన ఆఫీసు చుట్లూ తిరుగుతున్నారు. ఇటీవల డబ్బుల కోసం నిలదీయడంతో కంపెనీ లాస్‌లో ఉందని వెంకటేశ్వర్లు సభ్యులకు తెలిపాడు.
ఈ విషయం తెలియడంతో సభ్యులు అతడి ఇంటికి వెళ్లారు. దీంతో మూడు రోజుల క్రితం దేవుని దర్శనానికి వెళ్తున్నట్లు స్థానికంగా చెప్పి ఏపీకి వెళ్లిపోయాడు. అక్కడ నుంచి సభ్యులందరికి ఐపీ నోటీసులు పంపాడు. దీంతో బాధితులు లేబర్ కాలనీలో ఉన్న అతని ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు.