తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఎలుకల సంచారం ఎక్కువైంది అని చెప్పడానికి మరో ఘటన ముందుకు వచ్చింది. నిన్నటికి నిన్న వరంగల్ ఎంజీఎం లో ఎలుకల ఘటన గురించి మరిచిపోకముందే నేడు కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు కొరికిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
కాకతీయ యూనివర్సిటీ మహిళల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఎలుకలు కొరకడంతోనే గాయాలయ్యాయని తెలిసి విద్యార్థినులు వణికిపోయారు. ఈ మేరకు వర్సిటీలోని పద్మాక్షి హాస్టల్ ‘డి’ బ్లాక్‌లోని రూం నంబరు-7లో ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
చికిత్స కోసం బాధిత విద్యార్థినులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఘటన జరిగిన గదిలో పారిశుద్ధ్యం లోపించిందని.. పనికిరాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని ఫలితంగా ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని విద్యార్థినులు చెప్పారు.
ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ కేర్‌టేకర్లు, ఇతర సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.