- భాగ్యనగరంలో మరో కీలక ఘట్టం
- స్టార్టప్ లకు ప్రోత్సాహమిచ్చేలా టీ హబ్-2
- దేశానికే తలమానికంగా నిలిచేలా స్టార్టప్ పాలసీ
తెలంగాణ సీఎం కేసీఆర్ టీ హబ్ 2 ను ప్రారంభించారు. జూలై 1 వ తేదీనుండి స్టార్టప్ లు కొత్త భవనంలో తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మాదాపూర్లో అత్యున్నత ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ ఫస్ట్ ఫేజ్ ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. దానికి మంచి రెస్పాన్స్ రావడం, విజయవంతమైందని సర్కార్ భావించడంతో ఇప్పుడు టీ–హబ్ సెకండ్ ఫేజ్ ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు.
హైదరాబాద్ లోని రాయదుర్గంలో 400 కోట్ల రూపాయల ఖర్చుతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన రెండో దశ టీ–హబ్ లో.. ఒకేసారి 2 వేలకు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు నిర్వహించుకొనేలా మౌలిక వసతులు కల్పించారు. స్టార్టప్ లకు చేయూతను ఇచ్చేందుకు గాను టీ హబ్, వీ హబ్, డేటా సెంటర్, టీ వర్క్స్ వంటి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసింది. ఇన్నోవేషన్ ఎకో సిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడటంతో పాటు దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతోంది.
2015లో స్టార్టప్‌లను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఐటీ హబ్ ప్రస్థానం ప్రారంభమైంది. తాజా రెండో దశలో అత్యాధునిక వసతులు కల్పించారు. పది అంతస్తుల్లో టీ–హబ్ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతానికి ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఇందులో ఆఫీసులు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది.
స్టార్టప్ సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు త్వరలోనే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ లో టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇన్నోవేషన్స్ కు షేప్ ను ఇచ్చే ‘టీ–వర్క్స్ ’ను ఈ ఏడాది ఆగస్టులో, ఇమేజ్ సెంటర్ ను మరో ఏడాదిన్నరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.