భారతదేశం సత్యమేవ జయతే నినాదాన్ని నమ్ముతుందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. హైదరాబాద్ లోని తార్నాకలో కొత్తగా నిర్మించిన ఏబీవీపీ ఆఫీస్ స్ఫూర్తి ఛాత్రశక్తి భవన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం వేద పండితులు మోహన్ భగవత్ కు ఆశీర్వచనం అందజేశారు. తర్వాత కార్యాలయాన్ని సందర్భించారు. అక్కడ చనిపోయిన ఏబీవీపీ కార్యకర్తల ఫోటోలను సందర్శించి.. వారి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభాస్థలికి వెళ్లారు మోహన్ భగవత్.
వందసార్లు అబద్ధాలు చెబితే అది నిజం అవుతుందంటారు కానీ.. మన దేశంలో మాత్రం అది నిజం కాదని చెప్పారు. ఎందుకంటే మనం సత్యమేవ జయతే నినాదాన్ని నమ్ముతామని చెప్పారు. ఒకప్పుడు ఏబీవీపీని చూసి అవహేళన చేశారని.. కానీ.. ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈ భవనాన్ని నిర్మించుకున్నారని.. దీనికోసం అనేక మంది కార్యకర్తలు బలిదానాలు చేశారన్నారు.
రాజనీతిలో విజయం సాధించే వారిపై వ్యతిరేకులు అంతే స్థాయిలో పెరుగుతారన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. తమకు ఎలాంటి మెంటర్ లేడని.. చెప్పేవాడు లేడని అయినా తమకు అనుభవం ఉందని చెప్పారు. సొంతంగానే ఎదిగాం.. కార్యకర్తల సత్తాతో నిలబడ్డామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి గొప్పతనం గురించి వివరించారు. తండ్రి వ్యాఖ్య పరిపాలన చేసిన వారిని 8 వేల ఏళ్లు అయినా ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని అన్నారు. యూపీలో ఇప్పటికీ కొన్ని మైళ్ల దారిలో ఎవరూ నడవరని తెలిపారు. ఎందుకంటే సీతాదేవి పాదయాత్ర చేసే సమయంలో కాళ్ల నుంచి రక్తం వచ్చిందని.. అందుకే ఆ ప్రాంతంలో వ్యవసాయం కూడా చేయరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.