– ఇక నుంచి వారానికి రెండు కంపెనీలు
– కేంద్రంతో సత్సంబంధాలేనివే టార్గెట్
– 5 నెలల పాటు వరుస దాడులకు ప్లాన్
– బీఆర్ఎస్ కు ఆర్థిక అష్టదిగ్బంధం
– ఎటూ తేల్చుకోలేకపోతున్న రియల్ వ్యాపారులు
– లోకల్ ఐటీ అధికారులతో సంబంధం లేకుండానే రెయిడ్స్
– రేపటి నుంచే దాడులకు రెడీ
క్రైంబ్యూరో, తొలివెలుగు:గత వారం నాలుగు కంపెనీలపై ఆదాయపు పన్నుశాఖ ఏకకాలంలో 50 బృందాలతో సోదాలు నిర్వహించింది. రాజపుష్ప, వర్టెక్స్, ముప్పా, వసుధ ఫార్మా కెమికల్స్ కంపెనీల్లో దాడులు నిర్వహించి ఆడిటింగ్ లెక్కలు తీశారు. భారీగా పన్ను ఎగవేశారని నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ఇలా వారానికి 2 కంపెనీల చొప్పున 5 నెలల పాటు వరుస తనిఖీలు చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉంటే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బడా కాంట్రాక్ట్, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎంత ఎగ్గొట్టారో పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
మేఘా కృష్ణారెడ్డి రూ.12 వేల కోట్ల జీఎస్టీ ఎగవేశారని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. మైహోం లాంటి సంస్థల్లో గతంలో సోదాలు నిర్వహించి మధ్యంతరంగానే వెళ్లిపోయారనే వార్తలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ఈ కంపెనీలు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగించడంతో ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అదానీ కంపెనీపై ఎందుకు కేసు నమోదు చేయరని పార్లమెంట్ లో రోజూ గందరగోళమే నడుస్తోంది. అయినా బీజేపీ సర్కార్ మాత్రం తమ వ్యతిరేక పార్టీల రాష్ట్రాలపై మాత్రమే గురి పెట్టిందని తెలుస్తోంది. అక్కడికి స్థానిక అధికారులు కాకుండా ప్రత్యేక టీమ్స్‌ను పంపించి దాడులు నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. వారంలో ప్రతీ మంగళవారం ఉదయం 6 గంటలకు ఏ సంస్థపై సోదాలు చేయాలో మిగితా సిబ్బందికి తెలియకుండా జాగ్రత్త పడుతూ మెరుపు దాడులకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయా కంపెనీలను గుప్పిట్లో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో డబ్బుల ప్రవాహాన్ని అడ్డుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్లు రాజకీయ విమర్శలు ఉన్నాయి.
ఎలా దాడులు చేస్తున్నారంటే..!
ఫార్మా, రియల్ ఎస్టేట్, వైద్య, విద్యా రంగాల్లోనే ఎక్కువగా బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతోందని ఆదాయపు పన్ను శాఖ అంచనాలు వేసింది. మఫ్టీలో కస్టమర్ రూపంలో వెళ్లి డేటా రాబట్టుతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వారి డైరెక్టర్స్, ఉద్యోగుల ఇండ్లపై గురిపెడుతున్నారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో ఆరా తీసి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి కార్యాలయాల్లో విచారణ చేపడుతున్నారు. అయితే, కొంతమందికి ఢిల్లీలో ఉన్న పెద్దల ఫోన్ నెంబర్స్ ఇచ్చి అక్కడ కలవాలని సూచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీలో ఏం జరుగుతుందో బయటకు పొక్కడం లేదు. నగదును ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేస్తే వాటిని ఎందుకు డ్రా చేశారో లెక్కలు చెప్పాలి. ఆస్తులు కూడబెడితే, వచ్చిన అదాయం చూపించాలి. ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని లెక్కలు అడ్జెస్ట్ చేసుకున్న వారికి ఇబ్బందులు ఉంటున్నాయి. కొన్ని కంపెనీలు గత 3 ఏళ్లుగా క్లియర్ గా ఉన్నా 8 సంవత్సరాల కిత్రం ఆడిటింగ్ చేసిన వాటిని బయటకు తీసి లెక్కలు అడుగుతున్నట్లు సమాచారం.