– బడాబాబుల సొసైటీపై ఐటీ గురి
– బినామీ యాక్ట్ అమలు.. 10 మందికి నోటీసులు!
– గత నివేదికల ఆధారంగా బినామీల గుర్తింపు
– ఒక్కొక్కరు 30కి పైగా అక్రమ ప్లాట్స్ అమ్మకం!
– కమిటీల పంచాయితీతో తెరపైకి వాస్తవాలు
– నోటీసులతో లబోదిబోమంటున్న పెద్ద మనుషులు
– తొలివెలుగు దెబ్బకు బడా కార్పొరేట్ సంస్థకు చుక్కలు!
క్రైం బ్యూరో, తొలివెలుగు:జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి బినామీ యాక్ట్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎడాపెడా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, డ్రైవర్స్ కి అక్రమంగా ఇచ్చుకున్న ప్లాట్స్ పై ఐటీ శాఖ గురి పెట్టింది. 1987 నుంచి 1991 వరకు మూడు దఫాలుగా కేటాయించిన ప్లాట్స్ లో 168 మందికి అక్రమంగా ఇచ్చారని గతంలో విజిలెన్స్, సీబీసీఐడీతో పాటు సొసైటీ అధికారులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు ఆ రిపోర్టుల అధారంగానే ఐటీ శాఖ బినామీ యాక్ట్ ని ప్రయోగిస్తోంది. అందుకు 1987 నుంచి ఉన్న పాలక మండలి సభ్యులకు నోటీసులు కూడా జారీ చేసింది. వారిలో కొంత మంది ఐటీ శాఖ ముందు హాజరయ్యారు. దీంతో ఒక్కసారిగా సోసైటీలో కొందరికి భయం పట్టుకుంది. ఇద్దరు టీవీ ఛానల్స్ ఓనర్స్ దెబ్బలాటలతో మొత్తానికే మోసం వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఐటీ ఎంట్రీకి కారణాలేంటి?
గత కమిటీ, కొత్త కమిటీ మధ్య పంచాయితీ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఐటీ శాఖకు కొత్త పాలకమండలి ఫిర్యాదు చేయడంతోనే రంగంలోకి దిగినట్లు సమాచారం. సెక్రెటరీ మురళీ ముకుంద్ ఫైల్స్ తస్కరించారని విచారణలో చెప్పడంతో.. ఆయన్ను కూడా అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. గతంలో విజిలెన్స్, కమిటీలు ఇచ్చిన నివేదికలతో పాటు లేటెస్ట్ సమాచారాన్ని ఐటీ శాఖ రాబట్టింది. దీంతో బినామీ యాక్ట్ ప్రకారం విచారణ చేపట్టాలని యోచించింది. 10 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరికొంత మందికి ఇచ్చేందుకు రెడీ అయింది.
ఐటీ శాఖ గుర్తించిన విషయాలపై తొలివెలుగు ఎక్స్ క్లూజివ్..!
ప్రెసిడెంట్ టీఎల్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ఎం చౌదరితో పాటు సెక్రెటరీలుగా సీవీఆర్(సీ.వెంకటేశ్వరరావు), జీ నర్సింహారావు, పీ సుబ్బారావులు ఉన్న సమయంలో చేసిన వ్యవహారాలపై లోతుగా ఆరా తీశారు ఐటీ అధికారులు. సుబ్బారావు తన బంధువైన హన్మంతరావుని, సీవీఆర్ తన అనుచరుడైన నరేంద్ర చౌదరిని, నర్సింహారావు మైనర్ గా ఉన్నప్పుడే తన కుమారుడికి ప్లాట్స్ ఇప్పించడం.. ఇలా పురాతన కమిటీలో ఉన్న ఐదుగురు ఒక్కొక్కరు 30 ప్లాట్స్ కు పైగా దందాలు చేశారని విజిలెన్స్ రిపోర్ట్ తో పాటు తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యవహారాలన్నింటినీ గుర్తించారు. జూబ్లీహిల్స్ లోని సుమారు 5 ఎకరాల పబ్లిక్ ప్లేస్ ని 573 సిరీస్ ని బినామీలకు కేటాయించిన భూములపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. అందుకు ఆధారాలు కూడా సేకరించారు. ప్లాట్ నెంబర్ 573-ఏ తో పాటు ఏ1, ఏ2, ప్లాట్స్ ని.. ప్రీతి అనే మహిళకు 1995లో కేటాయించారు. ఈమె ఎన్ఎం చౌదరి కుమారుడైన సుభాష్ కి బినామీగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మూడు ప్లాట్స్ కలిపి ఒకరికే 4 వేల గజాలు ఎలా కేటాయించారనే దానిపై ఆరా తీశారు. ఆ తర్వాత.. స్టాబిషా బయో టెక్, జేస్తా గ్రీన్ ఫీల్డ్, ధనీస్తా పార్మ్స్, హాస్తా బయోటెక్.. ఇలా వీరందరి నుంచి ఓ కార్పొరేట్ సంస్థ డెవలప్మెంట్ చేసుకుంది. అక్రమంగా కేటాయించిన ప్లాట్ లో లిటిగేషన్ ఉండటంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఆ కంపెనీ వాలిపోయింది. కోట్లు దొచుకుంటోంది.
కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న వ్యవహారంపైనా ఆరా?
168 ప్లాట్స్ పై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు స్టే విధించింది. దాని పేరు చెప్పుకొని కమిటీ పెద్దలు భారీగా రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ రిటైర్డ్ జడ్జి కూతురు సునీతా రెడ్డికి 2001లో 573 సిరీస్ లో 2,119 గజాల ప్లాట్ కేటాయించారు. ఆ ప్లాట్ ని మంతెన నాగరాజుతో పాటు 9 మందికి 2002లో అమ్మకం జరుపుతున్నట్లు రిజిస్ట్రేషన్ చేశారు. వారు మళ్లీ 2007లో షోటైం డాట్ లిమిటెడ్ కి అమ్మకం జరిపారు. వారి వద్ద నుంచి మళ్లీ అదే కార్పొరేట్ సంస్థకు చేరుకుంది.
ఇదే సిరీస్ లో మైనర్ కి ప్లాట్!
నర్సింహారావు అనే సెక్రెటరీ తన కుమారుడు అనంద్ కి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే జూబ్లీహిల్స్ లో ప్లాట్ కేటాయించినట్లు తెలుస్తోంది. 1995లో 1,051 గజాలను రిజిస్ట్రేషన్ చేస్తే.. కార్పొరేట్ కంపెనీకి 2,140 గజాల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ఇచ్చారు. దీంతో నెలకు 35 లక్షల రెంట్ వస్తుందని ఐటీ శాఖ విచారణలో తేలింది. పీ శ్రీహరి కుమార్తె అయిన రమణశ్రీ పేరుతో 1,739 గజాలు 2002లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆమె తాజాగా 2016లో కార్పొరేట్ కంపెనీకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈమె వాటాగా 30 లక్షలు అద్దె రానున్నట్లు అధికారుల విచారణలో తేలింది. వీటితో పాటు.. శ్రీనివాస్ రెడ్డికి, అరవింద్ బాబుకి, నర్సింహారావుకి కేటాయించిన ప్లాట్స్ లో జరిగిన అవకతవకలపైనా ఆరా తీశారు.
టీఆర్ఎస్ బినామీ కంపెనీకి మొదలైన భయం..!
ఓ కార్పొరేట్ సంస్థ చేస్తున్న భూ భాగోతాలపై తొలివెలుగు 23 కథనాలను రాసింది. అందుకు ప్రతీది సాక్షాధారాలతో నిరూపించింది. ఇన్నాళ్ల పాటు తేలు కుట్టిన దొంగలాగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ సమాచారం అంతా ఐటీ శాఖకు చేరింది. దీంతో జూబ్లీహిల్స్ లో జరిగిన బాగోతం అంతా బయటకు వస్తోంది. అసలు 573 సిరీస్ లో ఆ కంపెనీ చేసింది ఏంటి..? ప్రభుత్వం స్పెషల్ జీవోలు వారికే ఎందుకిచ్చింది? రెరా అనుమతులు లేకుండానే వేల కోట్ల బిజినెస్ ఎలా చేస్తున్నారు? ఐటీ శాఖ వారికి ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో.. వీటన్నింటిపై తర్వాతి కథనంలో తెలుసుకుందాం.