పన్ను చెల్లింపు దారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట నిచ్చింది. కరోనా వైరస్ నేపధ్యంలో 2018 19 ఆర్ధిక సంవత్సరం పన్ను చెల్లింపు రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిజానికి గడువు ఈ నెల 31 తో ముగియనుంది. రిటర్న్స్ చెల్లింపులో ఆలస్యం అయితే చెల్లించే ఫెనాల్టీని 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది. పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసే గడువును కూడా మార్చి 31 నుంచి జూన్ 30 వరకు పొడిగించింది. వివద్ సే విశ్వాస్ పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ప్రిన్సిపల్ అమౌంట్ పై 10 శాతం వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వైరస్ కారణంగా నష్టాల్లో ఉన్న పారిశ్రామిక, ఇతర రంగాలకు ప్రభుత్వంఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రజలకు లాక్ డౌన్ కు సహకరించాలని మంత్రి ప్రజలను కోరారు.