– ఓవైపు టాస్క్ ఫోర్స్ తనిఖీలు
– ఇంకోవైపు ఐటీ సోదాలు
– ఈ పోటాపోటీ దాడుల్లో గెలుపెవరిది?
– మునుగోడు ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేదెవరు?
– హానర్ హోమ్స్ లోనూ సోదాలు
మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతోంది. నేతల హామీలు కోటలు దాటుతున్నాయి. కరెక్ట్ గా ఇదే సమయంలో ఐటీ సోదాలు, టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరగడం హాట్ టాపిక్ గా మారింది. పైకి అవి కనిపిస్తున్నా.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఈ పోటీ జరుగుతోందని ప్రచారం సాగుతోంది. నగరంలో ఈ మధ్య వరుసగా హవాలా సొమ్ము బయటపడుతోంది. అయితే.. పట్టుబడుతున్న సొమ్మంతా మునుగోడుకి లింక్ పెడుతోంది టాస్క్ ఫోర్స్.
గత 15 రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో రూ.12 కోట్ల వరకు దొరికాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 150 కోట్ల విలువైన భూమిని మరో బీజేపీ నేత, మాజీ ఎంపీకి అమ్మారు. ఈ క్రమంలోనే డబ్బు ట్రాన్స్ ఫర్ అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలా రూ.12 కోట్ల వరకు హవాలా సొమ్ము బయటపడినట్లు తెలుస్తోంది. అయితే.. ఇదంతా బీజేపీ మునుగోడుకు తరలిస్తోందన్న అనుమానాలను పోలీస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
టాస్క్ ఫోర్స్ తనిఖీల నేపథ్యంలో నగరంలోకి ఐటీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో గెలిచేందుకు గులాబీ నేతలు బంగారంతో ప్రలోభాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కోణంలో గల్ఫ్ ఆయిల్ భూముల వ్యవహారం లింకులపై ఐటీ ఫోకస్ పెట్టింది. ఆర్ఎస్ బ్రదర్స్, బిగ్ సీ కంపెనీల్లో సోదాలు చేపట్టింది. అన్ కౌంటబుల్ బంగారం కొనుగోళ్లు జరుపుతున్నట్లు గుర్తించింది. సేల్స్, ఐటీ చెల్లింపుల వివరాలు సేకరించింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, అకౌంట్స్ బుక్స్ స్వాధీనం చేసుకుంది.
గతంలో ఇదే భూ వ్యవహారంలో ఫినిక్స్ తో పాటు వాసవి, సుమధుర కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయి. తాజాగా వీటితో సంబంధాలు ఉన్న హానర్ హోమ్స్ సంస్థలో తనిఖీలు చేపట్టారు. మునుగోడు బైపోల్ నేపథ్యంలో హైదరాబాద్ టీమ్స్ టీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్, బిగ్ సీపై దాడులు జరపడం అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. డబ్బులు, బంగారం బయటకు రాకుండా ఉండేందుకు ఐటీ చూస్తున్నట్లుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకే ఇది బీజేపీ వేసిన ప్లాన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇటు టాస్క్ ఫోర్స్ బీజేపీ డబ్బును.. అటు ఐటీ టీఆర్ఎస్ డబ్బును పోటాపోటీగా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఇరు వర్గాలు అనుకుంటున్నాయి.