దాయాది దేశం పాకిస్తాన్ కూడా శ్రీలంక బాటలో ప్రయాణిస్తోందా..? త్వరలోనే పాక్ కూడా శ్రీలంక తరహాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందా…? పాక్ ప్రజలకు ఆర్థిక కష్టాలు తప్పవా…? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాక్‌లో పరిస్థితులు, పరిణామాలను గమనిస్తే సంక్షోభం గురించి పూర్తిగా అర్థమవుతుంది.
కశ్మీర్ విషయంపై పాక్ ప్రభుత్వం, సైనికాధికారులు ఎప్పటికప్పుడు లోతైన ఆలోచనలు చేస్తుంటారు. భారత్‌లో హింసాకాండను సృష్టించేందుకు ఉగ్రవాదాన్ని సైతం దాయాది దేశం పెంచి పోషిస్తోందని ఆరోపణలు కూడా వున్నాయి. ఈ క్రమంలో పాలు పోసి పెంచిన పాము పాక్ నే కాటేస్తోందని తెలుస్తోంది.
గతేడాది డిసెంబర్‌లో పాక్‌లో ఉగ్రవాద దాడుల వల్ల మరణాల సంఖ్య 53శాతం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. గతేడాది నవంబర్ 28న పాక్ సైన్యానికి, తెహరీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో సైనిక మరణాల సంఖ్య కూడా 55.5 శాతం పెరిగింది. ముఖ్యంగా ఖైబర్ ఫక్తుంక్వా వద్ద సామాన్య ప్రజల, ఉగ్రవాదుల మరణాల సంఖ్య కూడా ఎక్కువైంది. టీటీపీ నాయకుడు నూర్ వలీ మెహసూద్‌కు విధేయులుగా ఉన్న ఖుర్రం ఏజెన్సీకి చెందిన అహ్మద్, కక్కిమార్వత్ నుంచి సయీదుల్లా, ఉత్తర వజిరిస్థాన్ నుంచి జమీల్ మదాఖేల్ వంటి తీవ్రవాద కమాండర్‌లతో శాంతి చర్చలను పాక్ రద్దు చేసుకోవడంతో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.
పాకిస్తాన్‌లో అంతర్గత భద్రతా పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించడంతో పాటు విదేశీ మారక నిల్వలు 4.3 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరినట్టు తెలుస్తోంది. ఈ నిల్వలతో మూడు వారాలకు సరిపడే దిగుమతులను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం గలదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాలు 50 శాతానికి పైగా క్షీణించాయి. జూలై-నవంబర్ 2022 కాలానికి 430 మిలియన్ అమెరికన్ డాలర్లు, 2021లో అదే కాలానికి 885 మిలియన్ డాలర్లు నమోదయ్యాయి.
పాకిస్తాన్ ప్రభుత్వం 2022లో చివరి ఐదు నెలల్లో తన నికర ఆదాయంలో దాదాపు 107 శాతం (2.2 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయిలు) డెట్ సర్వీసింగ్, రక్షణ రంగం కోసమే ఖర్చు చేసింది, అభివృద్ధిపై పెట్టే ఖర్చు 53 శాతం తగ్గి 133 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు 28.7 శాతంగా వుంది. దీంతో పాక్ ఆర్థిక సహాయం కోసం యూఏఈ, సౌదీ అరెబియా లాంటి దేశాల వైపు చూస్తోంది.
పెరుగుతున్న హింస, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అస్థిరత కలిసి పాకిస్థాన్‌ను విఫల రాజ్యంగా మార్చాయి. పంజాబ్, కేపీ అసెంబ్లీను రద్దు చేస్తానని ప్రకటించడం ద్వారా పీటీఐ నేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికలకు తెరదీస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పంజాబ్ అసెంబ్లీ రద్దు, దేశంలో భయంకరమైన ఆర్థిక పరిస్థితిపై పీటీఐ, దాని మిత్రపక్షమైన పాకిస్తాన్ ముస్లిం లీగ్-క్వైద్-ఎ-ఆజం (పీఎంఎల్‌క్యూ) మధ్య విభేదాలు తలెత్తడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. మరోవైపు ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఇమ్రాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.