గ్రామ సర్పంచ్ గా పోటీచేస్తున్న లీడర్లు సైతం ఖరీదైన కార్లలో తిరిగే రోజులివి. కోట్లకు కోట్లు బ్యాంకు బ్యాలెన్సులు మెయింటెన్ చేసే కాలం ఇది. మరీ దేశ ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీ ఆస్తులెన్నో తెలుసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది. పారదర్శకత కోసం ప్రతి ఏడాది తన ఆస్తులు ప్రకటిస్తున్న మోడీ.. ఈ ఏడాది కూడా ప్రకటించారు.
తాజాగా ప్రకటించిన ఆస్తుల విలువను చూస్తే తన ఆదాయం 22లక్షలు పెరిగిందని ప్రధాని డిక్లేర్ చేశారు. ప్రస్తుతం మోడీకి 3.07కోట్ల ఆస్తులున్నాయి. గతేడాది ఆస్తులు 2.85కోట్లు మాత్రమే. ఇక మోడీకి స్టాక్ మార్కెట్లలో ఎలాంటి పెట్టుబడులు లేకపోగా, ఎల్ అండ్ టీలో పెట్టుబడులున్నాయని తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు 1.5లక్షలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ప్రకారం 8.6లక్షలున్నాయి. సొంత వాహనం మాత్రం లేదు. అయితే 1.48 లక్షలు విలువచేసే 4 బంగారు ఉంగరాలున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ 1.5 లక్షలు, ఆయన వద్ద 36,000 నగదు ఉన్నాయి.
అయితే, ఈ ఏడాది మోడీ ఆస్తుల విలువ పెరిగేందుకు ప్రధాన కారణం ఆయన సేవింగ్స్ ఖాతా ఉన్న గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న అకౌంట్. గతంలో ఈ విలువ 1.6కోట్లుండగా, ఇప్పుడు 1.8కోట్లకు చేరింది.
2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ ఎలాంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయలేదు.