భారత్ ఖాతాలో మరో ఘనవిజయం నమోదయ్యింది. న్యూజిలాండ్ , భారత్ ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ సునాయాసంగా విజయాన్ని కైవసం చేసుకుంది.168 పరుగుల తేడాతో మ్యాచ్ భారత్ సొంతమయ్యింది. ఉమ్రాన్ మాలిక్ వేసిన 13వ ఓవర్ లో మిచెల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో, 66 పరుగులకే కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
కీవీస్ జట్టులో మిచెల్ (35) టాప్ స్కోరర్. ఏకంగా నలుగురు (చాప్‌రన్, ఫెర్గూసన్, సోధి, లీస్టర్) డకౌట్ అయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు కనీస పోరాటం చేయలేకపోయింది. హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. గిల్ (126) సెంచరీ బాదడంతో 234 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి (44), సూర్యకుమార్ (24), పాండ్యా (30) రాణించారు. 235 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది. ఆశ్చర్యంగా ఈ మ్యాచ్ లో పేసర్లు చెలరేగిపోయారు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ కివీస్ ను ఒత్తిడిలోకి నెట్టారు.
తొలి ఓవర్ లోనే హార్దిక్ పాండ్యా ఓపెనర్ ఫిన్ అలెన్(3)ను ఔట్ చేసి న్యూజిలాండ్ ను దెబ్బకొట్టాడు. సూర్య కళ్లు చెదిరే రెండు క్యాచ్ లతో ఫిలిప్స్, అలెన్ పెవలియన్ చేరారు. ఆ తర్వాత అర్ష్ దీప్ సింగ్ కాన్వే, చాప్‌న్ ను వెనక్కి పంపాడు. దాంతో 13 రన్స్ కే 4 వికెట్లు.. 21 పరుగులకే 5 వికెట్లు.. 53కే 7 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్.
ఉమ్రాన్ మాలిక్ ప్రమాదకరమైన బ్రాస్ వెల్ ను బౌల్డ్ చేశాడు. శివం మావి ఒకే ఓవర్ లో శాంటర్న్, సోధిని ఔట్ చేశాడు. దాంతో, 10 ఓవర్లకు ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 56 రన్స్ చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ ఒంటరి పోరాటం చేశాడు. అతడిని ఉమ్రాన్ ఔట్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన గిల్ కీలకమైన మూడో టీ20ల్లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. షార్ట్ క్రికెట్ లో తొలి శతకం నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. 200 స్ట్రయిక్ రేటుతో బ్యాటింగ్ చేసిన అతను అద్వితీయ షాట్లతో అహ్మదాబాద్ స్టేడియాన్ని హోరెత్తించాడు. 35 బంతుల్లో 50 రన్స్ చేసిన అతను ఆ తర్వాతి 19 బంతుల్లోనే అంటే.. 54 బంతుల్లోనే శతకం చేయడం విశేషం.
రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి 87 రన్స్ జోడించాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ జట్టుపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఈ ఫార్మాట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత క్రికెటర్ గానూ రికార్డు సృష్టించాడు.