ఉన్న ఊరిని, కన్నతల్లినీ, నమ్ముకున్న కుటుంబాన్ని వదిలి సరిహద్దు పహారా కాస్తాడు సైనికుడు. దేశమే తన కుటుంబం అనుకుంటాడు. దేశం కోసం దేశంకాని దేశంతో పోరాడతాడు. పుట్టిన మట్టికోసం తనతో ఏ శత్రుత్వం లేని, ముక్కూ మొహం తెలియని వ్యక్తులపై తుపాకీ గురిపెడతాడు.
స్వదేశం కోసం శత్రుదేశ సైనికుడి ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తాడు. కానీ అతనికి ప్రాణం విలువ తెలుసు. ఎంతగా అంటే తన దేశ పౌరుడు అపాయంలో ఉంటే తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టేటంత. అలాంటి ఓ ఉదంతం వెలుగు చూసింది. మన దేశసైనికుడి ఉదారత సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.
అది జమ్ముకశ్మీర్ ఖారీ ప్రాంతంలోని హర్గం గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ నుంచి ఆర్మీకి కాల్ వచ్చింది. ఓ కుటుంబానికి మెడికల్ ఎమర్జెన్సీ ఉందన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఓ గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
మంచుతో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. నిండు చూలాలి ప్రశవ వేదనకు చలించిపోయారు మన జవాన్లు.ఆమె బాధను తమ బాధ్యతగా స్వీకరించారు. భూమికి 6 అడుగుల ఎత్తు పేరుకున్న మంచులో ఆరు గంటల పాటు శ్రమించి ఆ మహిళను 14 కిలోమీటర్లు స్ట్రెచర్ పై మోసుకెళ్ళారు.
అంగారీ అనే గ్రామంలో మరో ఆర్మీ టీమ్ అంబులెన్స్ ను సిద్ధం చేసింది. దీంతో గర్భిణీని సురక్షితంగా బనిలాల్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు. గర్భిణీ బంధువులు జవాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.