లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్లను వాడుతున్న వారికి శుభవార్త. ఇకపై సిలిండర్ ను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు వీలు ఏర్పడింది. నవంబర్ 1 నుంచే ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియ, డెలివరీ, ఇతర సమాచారంలో పలు మార్పులు, చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే గ్యాస్ కంపెనీ ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పద్ధతిని మార్చింది. వంట గ్యాస్ సిలిండర్లను బుక్ చేసేందుకు గాను ఇండేన్ కంపెనీ ఓ కొత్త నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని వివరాలను తన వినియోగదారులకు కూడా పంపించింది. ఇక ఆ కంపెనీ వినియోగదారులు ఇకపై వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న ఇండేన్ వినియోగదారుల కోసం ఆ కంపెనీ ఒకే కామన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా వినియోగదారులు ఇకపై ఫోన్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవాలనుకుంటే 7718955555 నంబర్‌కు ఫోన్ కాల్ చేయాల్సి ఉంటుంది. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్లను బుక్ చేయాలంటే ఈ నంబర్ ఉపయోగపడుతుంది.
ఇక ఇండేన్ గ్యాస్ కస్టమర్లు తమకు గ్యాస్ అందించే ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేసి లేదా https://iocl.com/Products/Indanegas.aspx అనే వెబ్‌సైట్ ద్వారా, ఇండేన్ యాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ ద్వారా అయితే వారు 7588888824 అనే నంబర్‌కు REFILL అని టైప్ చేసి మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఇండేన్ కస్టమర్లు తమ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుని ఉండాలి. కేవలం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారానే వాట్సాప్ నుంచి ఇండేన్ కస్టమర్లు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
కాగా వినియోగదారులకు గ్యాస్ సిలిండర్‌ను డెలివరీ చేసే సమయంలో వారికి వచ్చే ఓటీపీని చెప్పాల్సి ఉంటుంది. అలా చెబితేనే సిలిండర్‌ను డెలివరీ చేస్తారు. ఇక కస్టమర్లు తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయించుకోవాలంటే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లవచ్చు. లేదా ఇండేన్ వెబ్‌సైట్, యాప్ లలోనూ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.