యూపీలో అసెంబ్లీ మూడవ దశ పోలింగ్ మరి కొన్ని రోజుల్లో జరగనున్నది. ఇప్పటికే పలు పార్టీల నేతలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరిలో స్వతంత్ర అభ్యర్థి రామ్ దాస్ మానవ్ వినూత్న రీతిలో చేస్తున్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
యూపీకి చెందిన రామ్ దాస్ మానవ్ బ్యాంగిల్స్ కార్మికుల యూనియన్ కు నాయకుడు. ఆయన ఈసారి ఫిరోజ్ బాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తమ కార్మికుల సమస్యలను ఈ ఎన్నికల ద్వారా అందరి దృష్టికి తీసుకు వెళ్లాలని అనుకున్నారు.
అనుకున్నట్టుగానే చేతులకు కాళ్లకు సంకెళ్లు ధరించి వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. ‘ నేను బ్యాంగిల్స్ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నాను. సంకెళ్లు అనేవి ఫిరోజాబాద్ కార్మికుల బానిసత్వానికి గుర్తు. బానిసత్వం నుంచి వారికి విముక్తి కలిగించేంత వరకు నేను పోరాటాన్ని వదిలి పెట్టను ” అని చెబుతున్నారు.
ఈ నియోజక వర్గం నుంచి 11 మంది బరిలో ఉన్నారని. వారికి ఆయా రాజకీయ పార్టీలు నిధులను సమకూరుస్తున్నాయని ఆయన చెబుతున్నారు. ‘ నేను ప్రతీ ఒక్కరి నుంచి రూ. 10 తీసుకుంటున్నాను. దీంతో పాటు వారి ఓటు మాకే వేయాలని కోరుతున్నాను. వారి నుంచి నాకు పూర్తి స్థాయిలో మద్దతు వస్తోంది” అని పేర్కొన్నారు.