హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోష్ ఏరియాలో ఇళ్ల ధరలు రూ.కోట్లలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బిగ్‌షాట్స్ ఇక్కడ ఇళ్లను కొంటూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా విర్కో ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ యజమాని ఎన్.వెంకట రెడ్డి జూబ్లీహిల్స్‌లో రూ.41.3 కోట్లు పెట్టి ఓ ఇండిపెండెంట్ ఇంటిని కొన్నారు. జనవరి 28, 2021వ తేదీన సదరు ప్రాపర్టీ రిజిస్టర్ అయిందని జాప్‌కీ అనే వెబ్‌ద్వారా వెల్లడైంది.
కాగా ఇంటి స్థలం విస్తీర్ణం మొత్తం 1837 చదరపు గజాలు. ఆ ఇంటికి గాను రిజిస్ట్రేషన్‌లో భాగంగా స్టాంపు డ్యూటీ నిమిత్తం ఆయన రూ.2.27 కోట్లను చెల్లించారు. అలాగే రూ.20 లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు అయింది. ఇక జనవరి 12, 2021న రూ.10 కోట్లకు ఓ ఇండిపెండెంట్ ఇంటిని అర్వెన్సిస్ ఎనర్జీ అనే కంపెనీ డైరెక్టర్ అర్నిపల్లి హరీష్ కుమార్ కొన్నారు.
జూబ్లీహిల్స్ ఏరియాలో గత 5 ఏళ్ల కాలంలో రూ.10 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువైన ఇళ్లు 120 వరకు అమ్ముడయ్యాయి. ఈ మేరకు జాప్‌కీ అనే వెబ్‌సైట్ ద్వారా వివరాలు వెల్లడయ్యాయి. 2020లో జూబ్లీ హిల్స్ ఏరియాలో రూ.10 కోట్లు అంతకన్నా ఎక్కువ విలువ గల 17 ఇళ్లు అమ్మడయ్యాయి. ఆ ఇళ్లను కొనుగోలు చేసిన వారిలో టాలీవుడ్‌కు చెందిన పలువురితోపాటు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు.
జూన్ 26, 2020న జీవీకే గ్రూప్ చైర్మన్ జీవీ కృష్ణా రెడ్డి రూ.23 కోట్లకు ఓ ప్రాపర్టీని కొన్నారు. అలాగే న్యూలాండ్ ల్యాబ్స్ సీఈవో సుచేత్ రావ్ దావులూరి మే 18, 2020న రూ.20.7 కోట్లకు జూబ్లీహిల్స్‌లోనే ఓ ఇండిపెండెంట్ హౌజ్‌ను కొనుగోలు చేశారు. ఇక నటుడు అక్కినేని నాగ చైతన్య జనవరి 2020లో రూ.27.1 కోట్లకు అదే ఏరియాలో ఓ అపార్ట్‌మెంట్ కొన్నాడు. ఈ క్రమంలోనే అక్కడ 1000 చదరపు గజాలు అంతకన్నా ఎక్కువ స్థలం ఉన్న ఇళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. అక్కడ చదరపు గజం ధర రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతేడాది చివర్లో ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టాక అనేక వివాదాలు వచ్చాయి. దీంతో చాలా రోజుల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. అయితే మళ్లీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రియల్ ఎస్టేట్ పుంజుకుంది. జోరుగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.