ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగి శుక్రవారానికి సరిగ్గా ఏడాది.. రష్యా యుధ్ధాన్ని ఖండిస్తూ, ఉక్రెయిన్ నుంచి రష్యా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐరాస సర్వ ప్రతినిధి సభ రూపొందించిన తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్ కి ఇండియా దూరంగా ఉంది. ఐరాస అంతర్జాతీయ చట్టాలను, నిబంధనావళిని గౌరవించాలని, ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని, సమస్యకు సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారాన్నికనుగొనాలని కోరుతూ కూడా ఈ తీర్మానం నిర్దేశించింది. . కానీ దీనిపై ఇండియా పెదవి విరిచింది.
అటు రష్యా, ఇటు ఉక్రెయిన్.. రెండు దేశాలకూ అంగీకారయోగ్య మైన పరిష్కారం అసలు సమీప దూరంలో ఉందా అని భారత్ ప్రశ్నించింది. 193 సభ్య దేశాలున్న ఐరాస సర్వ ప్రతినిధి సభలో 141 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయగా, ఏడు దేశాలు దీన్ని వ్యతిరేకించాయి. ఇండియా, చైనా సహా 32 దేశాలు ఓటింగ్ లో పాల్గొనకుండా దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ నుంచి రష్యా తక్షణమే తన బలగాలను ఉపసంహరించుకుని, దౌత్యపరమైన చర్చలు ప్రారంభిం చాలని మెజారిటీ దేశాలు కోరాయి.
అయితే మానవ ప్రాణాలను పణంగా పెట్టి ఏ పరిష్కారాన్నీ సాధించలేమన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనను ఐరాస లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ స్పష్టం చేశారు. ఐరాస నియమావాళికి తమ దేశం ఎప్పుడూ కట్టుబడి ఉందని, ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు శాంతియుతమైన, దౌత్యపరమైన చర్చలే మేలని ఇండియా సదా కోరుతోందని ఆమె అన్నారు. ఈ తీర్మానం మనం సాధించదలచిన లక్ష్యాలకు దూరంగా ఉందని భావించినందునే దీనికి దూరంగా ఉన్నట్టు ఆమె వివరించారు. ఉక్రెయిన్ కి తమ దేశం మానవతా దృక్పథంతో సాయం అందిస్తోందని, ఈ తరుణంలో వార్ తగదని మోడీ ఇదివరకే రష్యాకు స్పష్టం చేశారని ఆమె పేర్కొన్నారు. .
పాకిస్తాన్ పై ఇండియా మండిపాటు
ఉక్రెయిన్ పై రష్యా వార్ ని ఖండిస్తూ ఐరాస రూపొందించిన తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా పాకిస్తాన్.. జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల ఇండియా మండిపడింది. రెచ్చగొట్టే ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, టెర్రరిస్టులకు మీ దేశం స్వర్గధామంగా ఉందన్న విషయాన్ని ఇదివరకే స్పష్టం చేశామని దుయ్యబట్టింది. ఇస్లామాబాద్ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలిసిందేనని పాక్ ను ఎద్దేవా చేసింది..