కరోనా వైరస్ పోరాటంలో వెనకబడి… తమ ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన తర్వాత మేలుకున్నారు అని విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ప్రధాని మోడీ తలొగ్గినట్లు కనపడుతోంది. తమ దేశానికి మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్ డ్రగ్ పంపాలంటూ గత కొంతకాలంగా అమెరికా విజ్ఞప్తి చేస్తూ వస్తుండగా, మోడీతో ట్రంప్ స్వయంగా మాట్లాడారు.
యాంటీ-మలేరియా డ్రగ్ అయిన హైడ్రో క్లోరోక్విన్ డ్రగ్ కరోనా వైరస్ ను అరికట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందంటూ ట్రంప్ కొంతకాలంగా ధీమాగా చెబుతున్నారు. దీంతో తమ దేశానికి డ్రగ్ పంపాలంటూ అమెరికా నుండి మార్చి నెలలో విజ్ఞప్తి వచ్చినా… భారత ప్రభుత్వం ఆ డ్రగ్ ఎగుమతులపై నిషేధం విధించింది.
అయితే… తాజాగా ట్రంప్ మాట్లాడుతూ నేను స్వయంగా కూడా మోడీని కోరాను. అయినా డ్రగ్ విడుదలపై నిర్ణయం జరగలేదు. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా… అమెరికాతో భారత్ చాలా విషయాల్లో లాభం పొందింది అని మర్చిపోవద్దు అంటూ హెచ్చరించాడు. దీంతో వెంటనే స్పందించిన భారత ప్రభుత్వం ఆ డ్రగ్ అత్యవసర పరిస్థితుల్లో కొన్ని దేశాలకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీవాస్తవ ప్రకటించారు.
భారత పౌరుల అవసరాలు దృష్టిలో ఉంచుకునే తాత్కాలికంగా ఎగుమతికి అనుమతిస్తున్నాం, దేశంలో ఉన్న ఆ డ్రగ్ నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం… తమకు భారత పౌరులే ముఖ్యమని ప్రకటించారు.