టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. నాగపూర్ టెస్టులో జడేజా ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు సందర్భంగా జడేజా చేతికి క్రీమ్ రాసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఐసీసీ. దీంతో అతనికి ఐసీసీ జరిమానా కూడా విధించింది. జడేజాకి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళికి చెందిన ఆర్టికల్ 2.20ను జడేజా అతిక్రమించినట్లు తేలింది.
ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని ఐసీసీ వెల్లడించింది. క్రమశిక్షణా చర్యల కింద జడేజాకు జరిమానాతో పాటు ఒక పాయింట్ ను డీమెరిట్ చేశారు. గడిచిన 24 నెలల కాలంలో జడేజాకు ఇది తొలి తప్పిదం అవుతుంది.
అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 9వ తేదీన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో.. 46వ ఓవర్ లో జడేజా తన ఇండెక్స్ ఫింగర్ కు సూత్నింగ్ క్రీమ్ ను అప్లై చేశాడు. సిరాజ్ నుంచి క్రీమ్ తీసుకున్న అతను ఎడమ చేతి చూపుడు వేలికి రుద్దాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, అభిమానులు జడేజా చీటింగ్ చేశాడని ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన బీసీసీఐ జడేజా వేలికి రాసుకున్నది నొప్పిని తగ్గించే క్రీమ్ అని క్లారిటీ ఇచ్చింది.
ఇండెక్స్ ఫింగర్ కు వాపు రావడం వల్ల జడేజా క్రీమ్ రద్దుకున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ల పర్మిషన్ లేకుండా అలా చేసినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ తప్పును జడేజా అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్ ఈ శిక్షను ఖరారు చేశారు. లెవల్ వన్ ఉల్లంఘన కింద జడేజాకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు.