చైనా బలగాల తీరు మారటం లేదు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ లోని భారత భూభాగానికి చొచ్చుకొచ్చి, ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా… ఇప్పుడు సిక్కిం రాష్ట్రంలో చొరబడేందుకు ప్రయత్నించింది. పైకి శాంతి మంత్రం జపిస్తూనే… మరోవైపు బలగాలను రంగంలోకి దింపుతుంది.
సిక్కింలోని నాకు లా కనుమ వద్ద భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. అప్రమత్తమైన భారత సైన్యం అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం తలెత్తిన ఈ ఘర్షణలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారు. ఈ ఘర్షణలో చైనా సైన్యానికి చెందిన 20 మంది, నలుగురు భారత సైనికులు గాయపడ్డారని తెలుస్తోంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ వెల్లడించింది.
ఇప్పటికే తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ త్సో, గాల్వాన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్ తదితర ప్రాంతాల్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణలు ఏర్పడగా, అంతకు ముందు ఇదే సరిహద్దు వద్ద కూడా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. 2017లో డోక్లాం వద్ద భారత్, చైనా బలగాలు 73 రోజులపాటు యుద్ధ సన్నాహకాలు చేశాయి.