బాలాకోట్ సర్జికల్ దాడుల తరువాత భారత-పాకిస్తాన్ దేశాలు అణు యుధ్ధానికి సిద్దమయ్యాయని, కానీ తామే జోక్యం చేసుకుని నివారించామని అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు.’ 2019 ఫిబ్రవరిలో లో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం ఆ రెండు దేశాలూ దాదాపు అణు యుద్ధం వరకు వచ్చాయి. అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాకీ విషయం చెబుతూ.. తమ దేశం కూడా పాక్ తో న్యూక్లియర్ వార్ కి సిద్జంగా ఉన్నదని తెలిపారు. అయితే భారత విదేశాంగ విధానాన్ని రూపొందించిన టీమ్ లో ఆమె కీలక పాత్ర పోషించలేదని భావించిన నేను .. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో దీనిపై మాట్లాడాను’ అని ఆయన వెల్లడించారు.
ఆ సమయంలో తాను వియత్నాంలో ఉన్నానని, యుద్ధం మంచిది కాదని దోవల్ కి చెప్పానని, తనకొక నిముషం వ్యవధినివ్వాలని కోరానని ఆయన వివరించారు. ‘నెవర్ గివ్ ఎన్ ఇంచ్.. ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ అనే తన పుస్తకంలో మైక్ పాంపియో ఈ విషయాలను వివరించారు.
ఇండియాతో తమ దేశానికున్నసన్నిహిత సంబంధాల నేపథ్యంలో మొదట ఆ దేశంతోనే మాట్లాడానన్నారు. నిజానికి ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించడానికి తమ దేశం ప్రయత్నిస్తూ వచ్చిందన్నారు. హనోయ్ లో ఆ రాత్రిని నేను మరిచిపోలేకపోతున్నా అని ఆయన పేర్కొన్నారు.
ఆ సమయంలో తాను, తమ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఇద్దరం అప్పటి పాక్ జనరల్ క్వామర్ బాజ్వా తో మాట్లాడగా.. ఇది నిజం కాదని చెప్పారని పాంపియో వెల్లడించారు. మొత్తానికి న్యూక్లియర్ వార్ జరగకుండా ఇరు దేశాలనూ తాను ఒప్పించగలిగానన్నారు. ఆ రాత్రి మేం చొరవ చూపకపోయి ఉంటే మరే దేశం కూడా ఇలా ముందుకు వచ్చేది కాదన్నారు.