ఇన్నాళ్లు కరోనా వ్యాక్సిన్ వచ్చినా పెద్ద వయస్సు వారికేనని, చిన్నారులకు ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదన్న ప్రచారం జరిగింది. కానీ భారత్ ఔషధ నియంత్రణ మండలి ఇచ్చిన అత్యవసర వ్యాక్సినేషన్ అనుమతుల్లో చిన్నారులకు కూడా ఇవ్వొచ్చని సూచించింది.
భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ తయారు చేసిన కోవాక్జిన్ ను 12 సంవత్సరాల వయస్సున్న పిల్లల నుండి ఇవ్వొచ్చని, సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న అస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను 18సంవత్సరాల వయస్సున్న వారి నుండి ఇచ్చేందుకు అనుమతి వచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్ లను అత్యవసర సమయంలో ఇచ్చేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు డీసీజీఐ ప్రకటించింది.
కోవాక్జిన్ తో పాటు కోవిషీల్డ్ కూడా సేఫ్ అని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి ఇచ్చామని, రెండు డోసుల చొప్పున ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని డీసీజీఐకి చెందిన వీజీ సోమని జాతీయమీడియాతో వ్యాఖ్యానించారు.