ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ ఊపిరి పీల్చుకునే సమయం వచ్చేసింది. కరోనాపై పోరులో కీలకంగా భావిస్తున్న వ్యాక్సిన్ ఇండియాలోనూ ఇక అందుబాటులోకి వచ్చేయనుంది. ఫేజ్-3 ట్రయల్స్ లో ఉన్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ లను అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతి ఇస్తూ భారత వ్యాక్సిన్ నిపుణుల కమిటీ క్లియర్ చేసింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇప్పటికే 10కోట్ల డోసులు తయారు చేశామని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇప్పటికే ప్రకటించింది.
28 రోజుల వ్యవధిలో రెండు డోసుల ద్వారా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. వ్యక్తి రోగనిరోధక శక్తిని పెంచి… కరోనా వైరస్ కు చెక్ పెట్టడం ఈ వ్యాక్సిన్ పని. ఇప్పటికే భారత్ లో డ్రైరన్ చేసి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లను పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా వ్యాక్సిన్ వేయనుంది.
ముందుగా హెల్త్ వర్కర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారు, 50ఏళ్ల పైబడిన వృద్ధులు ఇలా ఒక్కొక్కరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, చిన్నారులకు మాత్రం ఇప్పట్లో వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.