ఉక్రెయిన్- రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని భారత్ మంగళవారం కోరింది. దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, సామరస్య పూర్వక వాతావరణంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపింది.
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై భద్రతా మండలిలో అత్యవసర సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేయాలని అమెరికా, దాని మిత్రదేశాలు అభ్యర్థించాయి. ఈ క్రమంలో భద్రతా మండలిలో భారత్ మాట్లాడింది.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి మాట్లాడుతూ… రష్యన్- ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలపై అవి ప్రభావం చూపే అవకాశం ఉంది.
అన్ని దేశాల భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని తక్షణ ప్రాధాన్యతగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగేలా చేయాలి. ఆ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలి. అని అన్నారు.