కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు నవంబరు 6 న నిర్వహించదలచిన రెఫరెండను అనుమతించరాదని ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని ఇండియా కోరింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ అన్న సంస్థ ఆ రోజున ఒంటారియాలో ఈ రెఫరెండం నిర్వహించాలనుకుంటున్నదని దీన్ని ఆపివేయాలని అభ్యర్థించింది. ఇండియాకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి కార్యక్రమాలనూ అనుమతించవద్దని ఒటావా లోని భారత హైకమిషన్.. కెనడా గ్లోబల్ ఎఫైర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కి పంపిన లేఖలో కోరారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులు చేస్తున్న రెండో ప్రయత్నం ఇదని, లోగడ గత నెల 18 న బ్రాంప్టన్ లో కూడా వారిలా చేశారని కమిషన్ గుర్తు చేసింది.
ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలేనని, అమాయక పౌరులను టార్గెట్ గా పెట్టుకున్న హింసాత్మక సంస్థల ఆట కట్టించాలని పేర్కొంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ వంటి సంస్థలు టెర్రరిస్టు కార్యకలాపాలకు తమ దేశ గడ్డలను వినియోగించుకోకుండా చూడాలని భారత, కెనడా దేశాలు ఇదివరకే ఒడంబడిక కుదుర్చుకున్న విషయాన్ని ఇండియా మళ్ళీ ప్రస్తావించింది. ఇవి ఉభయ దేశాల భద్రతకు హానికరంగా పరిణమిస్తాయని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇలాంటి రెఫరెండం లను తాము గుర్తించబోమని కెనడా ప్రభుత్వం గత నెల 16 న ఓ నోట్ ని విడుదల చేసింది.
నవంబరు 6 న జరిగే రెఫరెండంలో పాల్గొనాలని, ప్రజలు ముఖ్యంగా ఇక్కడి భారతీయులు, సిక్కు విద్యార్థులు దీన్ని జయప్రదం చేయాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ కోరుతోంది. పైగాకెనడాలోని భారతీయ విద్యార్థులకు, సిక్కు స్టూడెంట్స్ కి మధ్య విభేదాలు సృష్టించడానికి యత్నిస్తోంది అని ఇండియన్ హైకమిషన్ ఆరోపించింది.
ఇలా మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్ట జూస్తోందని, అందువల్ల ట్రూడో ప్రభుత్వం ఈ సంస్థ ఉద్దేశాలను తీవ్రంగా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. ఖలిస్తానీ నాయకుడు జీ.ఎస్. పన్నున్ అరెస్టుకు సహకరించేందుకు వీలుగా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలన్న భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థనను ఇంటర్ పోల్ తిరస్కరించింది. పన్నున్ కెనడాలో ఉంటున్నప్పటికీ, ఆయన రాజకీయ కార్యకలాపాలు ఈ నోటీసు జారీ చేసేంత స్థాయిలో లేవని ఈ సంస్థ పేర్కొంది.