సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాల జనాభాల్లో తక్కువ స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుండటంపై భద్రతా మండలిలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాక్సిన్ల పంపిణీ, వాటిని అందుబాటులోకి తీసుకురావడంలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కారించాల్సిన ఆవశ్యకతను భారత్ భద్రతా మండలిలో నొక్కి చెప్పింది.
సైనిక సంక్షోభం ఉన్న ప్రాంతాల్లో భద్రతా మండలి తీర్మానాలు 2532, 2565లను అమలు చేసే అంశంపై ఇండియా ఈ సందర్బంగా మాట్లాడింది. ‘ ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా వ్యాక్సిన్ నేషన్ పూర్తి స్థాయిలో జరగడం లేదు. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశాల్లో ఇప్పటికీ వ్యాక్సినేషన్ స్థాయి చాలా తక్కువగా ఉంది’ భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి ఆర్. రవీంద్ర అన్నారు.
‘ మనం ఇప్పుడు కొవిడ్-19కు వ్యతిరేకంగా పలు కొత్త వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాము. ఇదే సమయంలో వ్యాక్సిన్ సమానత్వం, అందుబాటులోకి తేవడం, పంపిణీ లాంటి సమస్యలను పరిష్కరించాలి’ అని తెలిపారు.
వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడంలో భారత్ పాత్రను వివరిస్తూ.. ‘ ‘వన్ ఎర్త్- వన్ హెల్త్’ విజన్ కు అనుగుణంగా పలు దేశాలకు సరైన సమయంలో అవసరమైన వ్యాక్సిన్, మందులను అందించి పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను కాపాడంలో భారత్ కీలక పాత్ర పోషించిందన్నారు.