కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశం నుంచి ఇతర దేశాలకు గోధుమ ఎగుమతులను నిషేధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వార్షిక వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో దాదాపు ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయి 7.79, రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరుకున్నాయి .
ఈ నేపథ్యంలో దేశం నుంచి అన్ని రకాల గోధుమల ఎగుమతులపై మోడీ సర్కార్ నిషేధం విధించడం గమనార్హం. ఈ మేరకు అధిక ప్రొటీన్ గల దురుమ్ సహా పలు రకాల గోధుమలను ఉచితం నుంచి నిషేధిత జాబితాలోకి మారుస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
ఈ ఆదేశాలు మే 13 నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఇకపై రెండు రకాల షిప్ మెంట్ లను మాత్రమే అనుమతించనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇతర దేశాలతో ఉన్న ఒప్పందాల ప్రకారం ఆయా దేశాలకు సరఫరా చేసే గోధుమల విషయంలో ఎగుమతులను అనుమతించనున్నట్టు తెలిపింది.
ఇప్పటికే రవాణాకు సిద్ధంగా ఉన్న గోధుమలను ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా గోధమ పంట ఉత్పత్తిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.