జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మహమూద్ మదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు భారత్ మొదటి మాతృభూమి అని అన్నారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ లాగా భారత్ తమకు కూడా చెందినది అని తెలిపారు. ఈ దేశంపై మోడీ, భగవత్ లకు ఎంత హక్కు ఉంటుందో తనకు కూడా అంతే హక్కు ఉంటుందన్నారు.
ఢిల్లీలో నిర్వహిస్తున్న జమియత్ ఉలామా-ఇ-హింద్ ప్రారంభోత్సవ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశం కోసం ప్రధాని మోడీ, భగవత్ లతో పోలిస్తే తాను ఓ అడుగు ముందే ఉంటానని ఆయన చెప్పారు.
దేశంలో ఇస్లాం మతం చాలా ప్రాచీనమైనదని పేర్కొన్నారు, ముస్లింలకు భారత్ మొదటి మాతృభూమి అని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం బయట నుంచి వచ్చిందని పేర్కొనడం వాస్తవం కాదని ఆయన వివరించారు. అన్ని మతాల్లో కెల్లా ఇస్లాం పురాతనమైనదన్నారు.
హిందీ ముస్లింలకు భారత్ ఉత్తమమైన దేశమని ఆయన వెల్లడించారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కు తాను వ్యతిరేకం కాదన్నారు. కానీ హిందుత్వను తప్పుగా చూపిస్తున్నరన్నారు. ఇది భారత స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. బలవంతపు మత మార్పిడులకు తాము వ్యతిరేకమన్నారు.
స్వచ్ఛందంగా మతం మారుతున్న వారిపై కూడా నేడు తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు, బలవంతంగా, మోసం, దురాశతో మత మార్పిడికి కూడా తాము వ్యతిరేకమన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, మత స్వేచ్ఛ, ముస్లిం వ్యక్తిగత చట్టాలు, మదర్సాల ప్రతిపత్తి వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తామన్నారు.