రష్యా నుంచి ఇండియా భారీ ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. గత ఐదేళ్లలో సుమారు 13 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆయుధాలను భారత్ దిగుమతి చేసుకున్నట్టు రష్యన్ వార్తా సంస్థలు తెలియజేశాయి. ఇంతేగాక 10 బిలియన్ డాలర్లకు పైగా విలువైన సైనిక సాధనాలకు , అధునాతన ఆయుధాలకు ఇండియా ఆర్డర్ ఇచ్చినట్టు వెల్లడించాయి. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా వంటి పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ఈ ఆయుధ సరఫరా నిరాటంకంగా సాగుతోందని పేర్కొన్నాయి.
తాము కూడా ఇండియాకు సైనిక-సాంకేతిక సహకారాన్ని దృష్టిలోనుంచుకుని అన్ని విధాలా తోడ్పడుతున్నామని రష్యా సైనికాధికారి డిమిత్రీ షుగయెవ్ తెలిపారు. సగటున ఏటా ఆయుధ ఎగుమతి దాదాపు 14 బిలియన్ డాలర్ల నుంచి 15 బిలియన్ డాలర్లు ఉంటుందని ఇంటర్ ఫాక్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఏది ఏమైనా ‘ఆర్డర్ బుక్’ 50 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చునని ఈ సంస్థ అంచనా వేసింది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఇండియా నిర్ద్వంద్యంగా ఖండించక పోగా ఇరు దేశాలు దౌత్యపరంగా చర్చలు జరిపి తమా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరుతోంది. గతంలో కూడా ప్రధాని మోడీ ఈ విషయాన్నీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఈ మేరకు హితవు చెప్పారు.
అనేక దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాయి. అయినప్పటికీ ఇండియాతో బాటు చైనా, కొన్ని ఇతర దేశాలు తమ దేశం నుంచి ఆయుధాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయని డిమిత్రి షుగయెవ్ చెప్పారు. ఎస్-400 ట్రియంఫ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎస్-యు 30 యుద్ధవిమానాలు,మిగ్-19 హెలికాఫ్టర్ల వంటి తమ అధునాతన సిస్టమ్స్ పట్ల ఈ దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.