చైనాను భూతలం మీది నుంచే కాకుండా సముద్ర తలంలోనూ ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా గ్రేట్ నికోబార్ దీవుల్లో పటిష్టమైన నేవల్ బేస్ ను ఏర్పాటు చేస్తోంది. మలక్కా జలసంధికి ప్రవేశ మార్గంగా భావిస్తున్న ఇక్కడ ఈ నౌకా స్థావరం ఏర్పాటవుతోంది. ఇది ఇండోనేసియా కి కేవలం 90 మైళ్ళ దూరంలో ఉంది.
హిందూ మహాసముద్రంలో చైనా తన సైనిక కార్యకలాపాలను పెంచుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ దీవుల్లోని డిగ్ భౌతి, గ్వాడార్ ప్రాంతంలో ఈ నేవల్ బేస్ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐఎన్ఎస్ కొహసా పేరిట ఈ కొత్త స్థావరాన్ని నిర్మిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా రెగ్యులర్ గా తన యుద్ధ నౌకలను, సబ్ మెరైన్లను పంపుతున్న విషయాన్ని గుర్తించినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ.. కొన్ని విదేశీ మీడియా సంస్థలు పరిస్థితిని రెచ్చగొడుతున్నాయని. మమ్మల్ని ఎదుర్కొవాలన్నదే ఇండియా ఉద్దేశంగా కనబడుతోందని తన మిలిటరీ వెబ్ సైట్ లో ఆరోపించింది.
అండమాన్ నికోబార్ దీవులు డొమినియన్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రాదేశిక ప్రాంతాలని, అక్కడ ఆ దేశం సైనిక స్థావరాలను నిర్మించడం సాధారణ విషయమేనని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలోని ఏషియన్ ఆఫ్రికన్ మిలిటరీ ఎఫైర్స్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ డింగ్ హావో వ్యాఖ్యానించారు. కానీ ఇదే సమయంలో హిందూ మహాసముద్రంలో తమ సైనిక కార్యకలాపాలను ఆయన సమర్థించారు. ఏ దేశాన్నీ బెదిరించడానికి తాము వీటిని చేపట్టడం లేదని, ప్రపంచ శాంతి, సుస్థిరతలకోసమేనని చెప్పారు. ఏది ఏమైనా ఇండియా మాత్రం ముందు జాగ్రత్త చర్యగా తన రక్షణ కోసం అండమాన్ నికోబార్ దీవుల్లో నౌకా స్థావరం ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.